గ్రేటర్‌ ఎన్నికలకు టీచర్లు దూరం

ABN , First Publish Date - 2020-11-21T08:16:51+05:30 IST

ఎన్నికలంటే.. ఉపాధ్యాయులే విధుల్లో ఉంటారు! సాధారణంగా ఏ ఎన్నిక అయినా ఉపాధ్యాయులే ఎన్నికల విధుల్లో పాల్పంచుకుంటారు! కానీ, బ్యాలెట్‌ ద్వారా జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌

గ్రేటర్‌ ఎన్నికలకు టీచర్లు దూరం

ఉపాధ్యాయులను దూరం పెట్టాలని ప్రభుత్వ నిర్ణయం


హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలంటే.. ఉపాధ్యాయులే విధుల్లో ఉంటారు! సాధారణంగా ఏ ఎన్నిక అయినా ఉపాధ్యాయులే ఎన్నికల విధుల్లో పాల్పంచుకుంటారు! కానీ, బ్యాలెట్‌ ద్వారా జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు మాత్రం వారు దూరం! ఉపాధ్యాయులు కాకుండా కేవలం ఉద్యోగ వర్గాన్నే ఎన్నికల విధులకు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 19వ తేదీన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ (లెటర్‌ నం.12740/జీహెచ్‌ఎంసీ/2020) జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 150 డివిజన్లు ఉండగా.. వాటిలో 9,235 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఎన్నికల విధులు నిర్వర్తించడానికి ప్రిసైడింగ్‌ అధికారి, అదనపు ప్రిసైడింగ్‌ అధికారి, మరో ఇద్దరు ఇతరత్రా ప్రిసైడింగ్‌ అధికారులు (ఓపీవో- అథర్‌ ప్రిసైడింగ్‌ అధికారి) కలిపి 36,940 మంది సిబ్బంది అవసరమని గుర్తించారు. వీరు కాకుండా 30 శాతం అదనపు సిబ్బంది (11,082 మంది)ని రిజర్వ్‌లో పెట్టుకోనున్నారు. ఈ విధులకు ఉపాధ్యాయులను కాకుండా ఇతర సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. పెద్దస్థాయిలో పోలింగ్‌ సిబ్బంది అవసరం ఉందని గుర్తించే.. జిల్లాల నుంచి ఉద్యోగులను రప్పించనున్నారు. ఈ మేరకు కలెక్టర్లకు లేఖలు రాశారు. ఉద్యోగుల వివరాలతో జాబితా పంపించాలని లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి, గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటానికి ముందే 15 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయుల వివరాలను ప్రభుత్వం సేకరించింది. అయితే, ఈ దఫా గ్రేటర్‌ ఎన్నికలు రసవత్తరంగా జరగనుండటంతో టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.


సచివాలయ ఉద్యోగులకు  విధులు

ఎన్నికల విధుల కోసం సచివాలయంతోపాటు వివిధ శాఖల ఉద్యోగుల సేవలు వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో వినియోగించరాదని నిర్ణయం తీసుకోవడంతో సచివాలయంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల వివరాలను పంపించాలని ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శులు, అన్ని విభాగాల అధికారులకు ఆయన శుక్రవారం లేఖ రాశారు. ఆదాయం/ పన్నులు వసూలు చేసే (రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌) ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more