మార్కెట్‌లో ‘చింత’ పండు కొరత

ABN , First Publish Date - 2020-03-12T23:07:45+05:30 IST

హోల్‌సేల్‌ మార్కెట్‌లో చింతపండుకొరత తీవ్రంగా వుంది. కొత్త చింతపండు మార్కెట్‌కు తక్కువగా వస్తుండడంతో నిల్వచేసిన సరుకును కొందరు వ్యాపారులు దాచేస్తున్నారు.

మార్కెట్‌లో ‘చింత’ పండు కొరత

హైదరాబాద్‌: హోల్‌సేల్‌ మార్కెట్‌లో చింతపండుకొరత తీవ్రంగా వుంది. కొత్త చింతపండు మార్కెట్‌కు తక్కువగా వస్తుండడంతో నిల్వచేసిన సరుకును కొందరు వ్యాపారులు దాచేస్తున్నారు. దీంతో కొరత తీవ్రం అవుతోంది. ఉన్న సరుకును ధర పెంచి అమ్ముతున్నారు. ఇప్పటికే ప్రస్తుతం హోల్‌సేల్‌ మార్కెట్‌లో క్వింటాల్‌ చింత పండు ధర 21వేల నుంచి 24వేల రూపాయలు పలుకుతోంది. రిటైల్‌ మార్కెట్‌లో ఇప్పటికే 220 రూపాల నుంచి 250 రూపాయలకు పెంచి అమ్ముతున్నారు. సాధారణంగా చింత పండు ధర వందకు మించి ధర పెరిగేది కాదు. కానీ గత రెండుసంవత్సరాలుగా చింత పండు ధరను విపరీతంగా అమ్ముతున్నారు. దీంతో సాధారణ కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా చింతపండును పెద్దసంఖ్యలో రైతులు ఇక్కడికి తీసుకు వస్తున్నారు. తెలంగాణలోని మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌వంటి పలు జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని హోల్‌సేల్‌ మార్కెట్‌లకు తరలిస్తున్నారు. 


అలాగే ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా నగరానికి చింత పండు దిగుమతి జరుగుతుంది. కానీ ఈసారి చింత పండు కొరత రావడానికి ప్రధాన కారణం ఇటీవల పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు, గాలికి చాలా జిల్లాల్లో చెట్ల నుంచి చింత రాలిపడిపోవడం వల్ల పెద్దమొత్తంలో నష్టం వచ్చినట్టు వ్యాపారులు చెబుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి క్వింటాల్‌కు దాదాపు 7 నుంచి 8వేల రూపాయలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. గత సంవత్సరం క్వింటాల్‌కు 16వేల నుంచి 18వేల రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం క్వింటాల్‌కు 24వేల రూపాయలకు వరకూ పలుకుతోంది. ఈ పరిస్థితిని కొందరు కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కొందరు గత సంవత్సరం నుంచి గోదాముల్లో దాచి ఉంచిన నిల్వలను ఇప్పుడిప్పుడే ధరలు పెంచి బయటకు తీస్తున్నారు. మరి కొందరు మార్కెట్‌కు వచ్చిన చింత పండును తక్కువ ధరలకు కొని ఎక్కువధరలకు అమ్ముతున్నారు. గత సంవత్సరం రోజుకు 50 నుంచి 60లారీల చింత పండు మార్కెట్‌కు తరలి రాగా ప్రస్తుతం రోజుకు 30 నుంచి 40 లారీల లోపే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ కారణంగానే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. గత సంవత్సరం రిటైల్‌ మార్కెట్‌లో కిలో చింత పండు 180 నుంచి 200 రూపాయలు పలుకగా, ప్రస్తుతం 250 రూపాయల వరకు పలుకుతోంది. ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

Updated Date - 2020-03-12T23:07:45+05:30 IST