మామిడిపల్లిలో మెగా డెయిరీ

ABN , First Publish Date - 2020-07-10T08:57:34+05:30 IST

మామిడిపల్లిలో మెగా డెయిరీ

మామిడిపల్లిలో మెగా డెయిరీ

రూ.250కోట్లతో ఏర్పాటు: తలసాని


హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రూ.250కోట్లతో మెగా డెయిరీ నిర్మించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. శ్రావణ మాసంలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో గురువారం పశుసంవర్థక శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మామిడిపల్లిలో శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గొల్ల, కురుమలకు 80లక్షల గొర్రెలను పంపిణీ చేశామని, ఇప్పుడు పిల్లలతో కలుపుకొని వాటి సంఖ్య 2 కోట్లకు చేరిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మొబైల్‌ మాంసం దుకాణాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి కమిటీ వేశామని, నెల రోజుల్లో నివేదిక వస్తుందని తెలిపారు. విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మొబైల్‌ ఔట్‌లెట్ల ద్వారా విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఖమ్మం, వనపర్తిలో షీప్‌ మార్కెట్ల నిర్మాణానికి రూ.25 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.

Updated Date - 2020-07-10T08:57:34+05:30 IST