ఆస్పత్రుల్లో రక్షణ చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2020-08-11T08:42:58+05:30 IST
ఆస్పత్రుల్లో రక్షణ చర్యలు తీసుకోండి

అమ్మోనియం నైట్రేట్‌పై భద్రం సుమా .. ట్విటర్‌లో గవర్నర్
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రులు ప్రజలకు వైద్యం చేసే దేవాలయాలని, అందువల్ల అవి పూర్తి భద్రతను కలిగి ఉండేలా చూడాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ అనేది అత్యంత ప్రాధాన్యం కావాలని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరుగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆస్పత్రుల రక్షణపై వచ్చిన కథనాలపై స్పందించిన గవర్నర్ ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కాగా, చెన్నైలో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్‌ను హైదరాబాద్‌కు తరలించడంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. జర భద్రం అంటూ ఆమె ట్విటర్‌లో పోస్ట్ చేశారు. లెబనాన్ రాజధాని బీరుట్‌లో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ పేలి భారీ విధ్వంసంతో పాటు ప్రాణనష్టం సృష్టించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో చెన్నైలో 750 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నిల్వలపై దేశమంతా చర్చ జరిగింది. దాంతో దీన్ని హైదరాబాద్‌కు ఆదివారం రాత్రి తరలించిన సమాచారం అందుకున్న గవర్నర్... తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజల రక్షణను ప్రామాణికంగా తీసుకోవాలని గుర్తు చేశారు.