ఐటీ విభాగానికి తహసీల్దార్‌ నగదు!

ABN , First Publish Date - 2020-06-16T10:49:27+05:30 IST

షేక్‌పేట్‌ తహసీల్దార్‌ చింతల సుజాత ఇంట్లో జరిపిన సోదాల్లో మూడు బ్యాగుల్లో పెట్టిన రూ. 24.9 లక్షల నగదు, అరకిలో బంగారం,

ఐటీ విభాగానికి తహసీల్దార్‌ నగదు!

హైదరాబాద్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): షేక్‌పేట్‌ తహసీల్దార్‌ చింతల సుజాత ఇంట్లో జరిపిన సోదాల్లో మూడు బ్యాగుల్లో పెట్టిన రూ. 24.9 లక్షల నగదు, అరకిలో బంగారం, రెండు ప్లాట్లకు సంబంధించిన ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఆదాయపన్ను శాఖ (ఐటీ)కు అప్పగించాలని నిర్ణయించారు. భూవివాద పరిష్కారానికి రూ. 15 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించి, షేక్‌పేట్‌ తహసీల్దార్‌ సుజాతను ఏసీబీ అధికారులు గత వారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోదాల సమయంలో లభించిన నగదు విషయంలో సుజాత, ఆమె భర్త భిన్నమైన వివరణలు ఇచ్చినట్లు తెలిసింది.


అది తన సేవింగ్స్‌ అని సుజాత చెప్పగా.. తమ భూమిని అమ్మగా వచ్చిన డబ్బు అని ఆమె భర్త చెప్పినట్లు సమాచారం. దీనిపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేపట్టాయి. సుజాతకు మొత్తం 5 బ్యాంకుల్లో ఖాతాలున్నట్లు గుర్తించాయి. ఆమె ఇంట్లో పెద్దమొత్తంలో నగదు లభించడాన్ని బట్టి.. గతంలోనూ భూవివాదాలను ఏమైనా పరిష్కరించిందా? ఆమెకు రెండోసారి షేక్‌పేట్‌కు పోస్టింగ్‌ రావడానికి కారణాలేంటి? వివాదాస్పద భూముల పరిష్కారమేమైనా జరిగిందా? అనే కోణాల్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రిమాండ్లో ఉన్న సుజాతను కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఆస్కారం లేకపోవడంతో ఏసీబీ సొంత దర్యాప్తులోనే వివరాలు రాబట్టాల్సి ఉంది.

Updated Date - 2020-06-16T10:49:27+05:30 IST