పీఎఫ్ పేరిట స్వాహా
ABN , First Publish Date - 2020-11-03T07:08:46+05:30 IST
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ సోర్సింగ్ కింద పని చేసే వేలాది మంది సిబ్బందికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ మొత్తం వారి ఖాతాల్లో జమ
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల మాయాజాలం..
ఆస్పత్రుల్లో సిబ్బంది వేతనాల నుంచి కోతలు
పీఎఫ్ కట్టకుండానే కోట్లు నొక్కేస్తున్న వైనం
పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు
కార్మికులు అడిగితే పొంతన లేని సమాధానాలు
కార్మిక శాఖ అధికారులకు ఇటీవలే ఫిర్యాదు
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ సోర్సింగ్ కింద పని చేసే వేలాది మంది సిబ్బందికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ మొత్తం వారి ఖాతాల్లో జమ కావడం లేదు. కార్మికుల పీఎఫ్ పేరిట కోట్లాది రూపాయలను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలే జేబులో వేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా పీఎఫ్ కట్టకపోయినా సదరు ఏజెన్సీలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలో అందరికీ అందాల్సిం ది అందుతోందని, అందుకే స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ సోర్సింగ్ కింద పని చేసే సిబ్బంది వేతనాల నుంచి ప్రావిడెంట్ ఫండ్ పేరిట 12 శాతం, ఈఎ్‌సఐ పేరిట 1.75 శాతాన్ని ఏజెన్సీలు కట్ చేస్తాయి. పీఎఫ్ మొత్తా న్ని కార్మికుల పేరిట ఖాతా తెరిచి విధిగా.. అందులో జమ చేయాలి. అలా ప్రతి నెలా పీఎఫ్, ఈఎ్‌సఐ కట్టిన రశీదులను విధిగా ప్రభుత్వానికి చూపించాలి. కానీ.. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. హైదరాబాద్ జిల్లాలో డీఎంఈ, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 24 ఆస్పత్రులు ఉండగా.. వీటిలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ కింద 3 వేల మంది, వార్డు స్టాఫ్ కింద 600 మంది, టెక్నీషియన్స్‌గా 200 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా 100 మంది పని చేస్తున్నారు.
ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల్లో దాదాపు 550 మంది స్టాఫ్ నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు పలు జిల్లాల్లో వేలాది మంది కార్మికులు ఉన్నారు. వీరిలో మెజారిటీ కార్మికులకు సదరు ఏజెన్సీలు పీఎఫ్ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయడం లేదు. కనీసం తమకు పే స్లిప్స్ కూడా ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. పది మందిలో ఒకరికో, ఇద్దరికో మాత్రమే పీఎఫ్ కడుతూ.. మిగతా మొత్తాన్ని ఏజెన్సీలే దండుకుంటున్నాయి.
పీఎఫ్ నంబర్ అడిగితే చీదరింపులు, ఛీత్కారాలే ఎదురవుతున్నాయని, ఉన్న ఉద్యోగం ఎక్కడ ఊడుతుందోనన్న భయంతో ఆ వివరాల జోలికి వెళ్లడం లేదని ఒక శానిటేషన్ వర్కర్.. తన ఆవేదనను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ పీఎఫ్ కట్టలేదంటూ ఈపీఎ్‌ఫవో నుంచి మెస్సేజ్ వచ్చిందని మరో కార్మికుడు వివరించారు.
రిమిటెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకపోయినా..
వాస్తవానికి కార్మికులకు సంబంధించిన పీఎఫ్, ఈఎ్‌సఐ కట్టిన రశీదుల రిమిటెన్స్ సర్టిఫికెట్‌ను బిల్లులు క్లెయిమ్ చేసే సమయంలో విధిగా ఏజెన్సీలు సమర్పించాలి. అప్పుడే అధికారులు వారికి బిల్లులు మంజూరు చేయాలి. కానీ, ఇవేమీ చూడకుండానే అధికారులు బిల్లులు మంజూరు చేస్తున్నారని, అందుకు ప్రతినెలా వారికి ఎంతో కొంత ముడుతుందని, అందుకే గుడ్డిగా బిల్లులు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల కొందరు కార్మికులు ఫిర్యాదు చేశారు.
పీఎఫ్ నంబరే చెప్పడం లేదు
నా ప్రావిడెంట్ ఫండ్ కడుతున్నారో లేదో తెలియదు. పీఎఫ్ నంబర్ కోసం ఏడాదిగా తిప్పుతున్నారు. అడిగితే ఇదిగో అదిగో అంటున్నారు. చాలా మందిది ఇదే పరిస్థితి. ఒకరిద్దరికే పీఎఫ్ కడుతున్నట్టు ఫోన్‌కు మేసేజ్‌లు వస్తున్నాయి. మిగతావాళ్లవి ఏం అవుతున్నాయో తెలియదు.
- నర్సు, గాంధీ ఆస్పత్రి
సమాధానం చెప్పడం లేదు
పాత కాంట్రాక్టర్ పీఎఫ్ కట్టేవారు. ప్రతి నెలా ఫోన్‌కు మేసేజ్ వచ్చేది. ఇప్పుడు మాలో చాలామందికి పీఎఫ్ కట్ చేస్తున్నారు కానీ అవి జమ అవుతున్నాయో లేదో తెలియదు. అడిగితే సమాధానం రావడం లేదు. ఉద్యోగం ఎక్కడ ఊడుతుందోనన్న భయంతో గట్టిగా అడగలేకపోతున్నాం.
- శానిటేషన్ వర్కర్, డీఎంఈ కార్యాలయం