క్షేత్ర సహాయకులపై సస్పెన్షన్‌ అస్త్రం

ABN , First Publish Date - 2020-03-18T09:05:58+05:30 IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకుల(ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు-ఎ్‌ఫఏ)పై జిల్లాల అధికారులు సస్పెన్షన్‌ వేటు...

క్షేత్ర సహాయకులపై సస్పెన్షన్‌ అస్త్రం

  • వారు ప్రభుత్వ ఉద్యోగులు కారన్న సీఎం..
  • రాష్ట్రంలో వేలాదిగా తొలగింపు


హైదరాబాద్‌, మార్చి 17(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకుల(ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు-ఎ్‌ఫఏ)పై జిల్లాల అధికారులు సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు. జూలై 1, 2018 నుంచి జూన్‌ 30, 2019 వరకు ఎఫ్‌ఏలు తమ పరిధిలో కల్పించిన ఉపాధి పనిదినాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి సంవత్సరం కాంట్రాక్టును రెన్యువల్‌ చేస్తామని పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నిర్దేశించిన లక్ష్యంలో 30 శాతానికి కంటే ఎక్కువ పనిదినాలను కల్పించిన వారితో మొదటి జాబితాను, 20-29 శాతం పనిదినాలు కల్పించిన వారితో రెండవ జాబితాను, 20 శాతం కంటే తక్కువ ఉన్న వారితో మూడవ జాబితాను రూపొందించారు. మొదటి జాబితా వారిని యథావిధిగా కొనసాగించడం, రెండవ జాబితాలోని వారి వేతనంలో కోత పెట్టడం, మూడవ జాబితాలో వారిని తొలగించడం వంటి చర్యలకు పంచాయతీరాజ్‌ శాఖ సిద్ధమైంది.


కాగా పనిదినాల లక్ష్యాలతో ముడిపెట్టడాన్ని నిరసిస్తూ క్షేత్ర సహాయకులు 12 నుంచి సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 6 వేల మంది క్షేత్ర సహాయకుల వేతనంలో కోత పడటం లేదా ఉద్యోగాలు పోయే జాబితాల్లో ఉన్నారు. క్షేత్ర సహాయకుల సమ్మెతో ఉపాధి హామీ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. క్షేత్ర సహాయకులు ప్రభుత్వ ఉద్యోగులు కారని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదని, జిల్లాల అధికారులే చూసుకుంటారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పనిలోకి రాకపోతే వారి ఉద్యోగాలే పోతాయి... కొత్త వారు వస్తారని  వ్యాఖ్యానించడం గమనార్హం. 


ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 311 మంది సస్పెన్షన్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో 235 మంది ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లపై వేటు పడింది. ఈ జిల్లాలో మొత్తం 238 మంది కాగా.. ప్రస్తుతం ముగ్గురు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. మిగిలిన వారందరినీ సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ వెంకట్రావ్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల స్థానంలో సీనియర్‌ మేట్‌లకు బాధ్యతలు అప్పగిస్తామని డీఆర్డీవో పీడీ వెంకట్‌రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లాలో తొలి విడతగా 76 మందిని విధుల నుంచి తప్పించినట్టు డీఆర్డీవో కాళిందిని తెలిపారు.

Updated Date - 2020-03-18T09:05:58+05:30 IST