‘సాగర్‌’ ఉప ఎన్నికపై నిఘా!

ABN , First Publish Date - 2020-12-15T07:53:41+05:30 IST

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అక్కడ పోటీ చేయాలనుకునేవారు,

‘సాగర్‌’ ఉప ఎన్నికపై నిఘా!

రాష్ట్ర నిఘా వర్గాల ఆరా

ప్రచారం మొదలుపెట్టిన బీజేపీ 

నల్లగొండ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అక్కడ పోటీ చేయాలనుకునేవారు, రాజకీయ పక్షాలు వివిధ పద్ధతుల్లో సమాచారం సేకరిస్తున్నాయి. నర్సింహయ్య మృతి చెందిన తరువాత మూడు రోజులకే ఇంటెలిజెన్స్‌ బృందం నియోజకవర్గం అంతా తిరిగింది. నర్సింహయ్య కుటుంబానికి ఉన్న సానుభూతి, పలుకుబడి, యాదవ, లంబాడ, రెడ్డి సామాజిక వర్గాల అభిప్రాయం ఎట్లా ఉంది? ఆ కుటుంబానికి కాకుండా మరొకరికి టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఇస్తే పరిస్థితి ఏమిటన్న అంశాలపై ఆరా తీసింది.


గతంలో ఈ నియోజకవర్గంలో పనిచేసిన అనుభవం ఉండి ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇంటెలిజెన్స్‌ సిబ్బందిని ఈ రహస్య సర్వేకు వినియోగించారు. ఆ తరువాత జిల్లాలోని ఎస్‌బీ(స్పెషల్‌ బ్రాంచి) ద్వారా సుదీర్ఘ కసరత్తు మొదలు పెట్టారు. రెండు మూడు రోజల్లో ఈ సర్వే తుది దశకు చేరనుంది. ఈ నెల 13వ తేదీన నర్సింహయ్య సంతాప సభ ముగియడంతో బీజేపీ నాయకులు ప్రచార పర్వంలోకి దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి ఆయన సతీమణితో కలిసి సాగర్‌ నియోజకవర్గలోని పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలో సోమవారం జెండావిష్కరణ చేసి ప్రచారం ప్రారంభించారు.


‘నియోజకవర్గం కోడలిగా తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. రాష్ట్రంలో ప్రస్తుతం డ్రైనేజీ, శ్మశాన వాటికలు, రోడ్ల పనులన్నీ ఉపాధి హామీ నిధులతోనే జరుగుతున్నాయి. ఈ పనులు జరగడానికి కేంద్రంలోని మోదీ సర్కారు పుణ్యమే’ అని శ్రీధర్‌రెడ్డి సతీమణి నివేదిత తన భరత్తతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. వీరి ప్రచారంపై సొంత పార్టీలోనే విమర్మలు మొదలయ్యాయి. ‘అభ్యర్థి ఎవరనేది పార్టీ ఇప్పటికీ నిర్ణయించలేదు, టికెట్‌ కోసం పార్టీలో ఒత్తిడి పెంచే వ్యూహంతో ఆ దంపతులు ప్రచారం ప్రారంభించారు, ప్రస్తుతం మా దృష్టి అంతా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఉంది’ అని జిల్లా కీలక నేతలు చెబుతున్నారు. 


Updated Date - 2020-12-15T07:53:41+05:30 IST