పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రయిక్‌

ABN , First Publish Date - 2020-11-25T06:55:22+05:30 IST

‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేం గెలిచి.. మేయర్‌ పీఠం దక్కించుకుంటే బిడ్డా.. పాతబస్తీ మీద సర్జికల్‌ స్ట్రయిక్‌ చేసి పాకిస్థానీలు, రోహింగ్యాలను ఇక్కడి నుంచి తరమితరమి కొట్టే బాధ్యతను బీజేపీ తీసుకుంటుంది’

పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రయిక్‌

దోపిడీ దొంగలు, అవినీతి, కుటుంబస్వామ్యంపైనా దాడి

భాగ్యనగరం అభివృద్ధికి కేంద్రం 12వేల కోట్లు ఇచ్చింది 

నా దగ్గర లెక్క ఉంది.. తప్పయితే నా మీద కేసులు పెట్టు

నిజమైతే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పు 

నా పేరిట దొంగలేఖ రాసి.. ప్రజలకు డబ్బు రాకుండా చేశారు

బీజేపీకి భయపడే ఫాంహౌస్‌ నుంచి బయటకొచ్చారు

పాత చింతకాయ పచ్చడిలా టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో 

ముస్లిం ఓట్లతో గెలవాలని చూస్తున్నవారు లౌకికవాదులా? 

మద్యం తాగి ప్రభుత్వాన్ని నడపడం రాష్ట్రానికి ప్రమాదకరం

ఫౌంహౌస్‌ ముఖ్యమంత్రి మనకు అవసరమా? 

5 రోజులు బీజేపీకి పనిచేస్తే ఐదేళ్లు సేవ చేస్తాం: సంజయ్‌ 

ప్రచారానికి అమిత్‌ షా? ఆహ్వానించిన రాష్ట్ర బీజేపీ శాఖ

ఇక్కడి నుంచి పాకిస్థానీయులను, రోహింగ్యాలను తరిమేస్తాం


హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  మేం గెలిచి.. మేయర్‌ పీఠం దక్కించుకుంటే బిడ్డా.. పాతబస్తీ మీద సర్జికల్‌ స్ట్రయిక్‌ చేసి పాకిస్థానీలు, రోహింగ్యాలను ఇక్కడి నుంచి తరమితరమి కొట్టే బాధ్యతను బీజేపీ తీసుకుంటుంది’ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ పోరాడుతుందని, జనాభాలో 80శాతం ఉన్న ప్రజల మనోభావాలు, సంక్షేమం కోసం పాటుపడుతుందని సంజయ్‌ పేర్కొన్నారు. ముస్లిం ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్న వాళ్లు లౌకికవాదులు ఎలా అవుతారు? అని ప్రశ్నించారు. తన నోటి నుంచి హిందుస్థాన్‌ అనే పదాన్ని పలకనని ఓ ఎమ్మెల్యే అన్నారని, అలాంటి వారి పార్టీ అవసరమా? అని ప్రశ్నించారు.


ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్‌ఎస్‌కుట్ర చేస్తోందని.. డబ్బులను పంచుతోందని.. ఇచ్చే డబ్బు తీసుకొని.. ఓటు మాత్రం బీజేపీకే వేయండి అని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే మజ్లి్‌సకు వేసినట్లేనన్నారు. వచ్చే ఐదు రోజుల పాటు బీజేపీ కోసం పనిచేస్తే.. ఐదేళ్లు సేవ చేస్తామని పేర్కొన్నారు. భాగ్యనగర్‌ భవిష్యత్తు, అభివృద్దిని నిర్దేశించే ఎన్నికలు ఇవని, ఆలోచించి తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నగరంలోని హబ్సిగూడ, చిలుకానగర్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బండి సంజయ్‌ ప్రచారం నిర్వహించారు.


భాగ్యనగరం అభివృద్ధికి గత ఐదేళ్లలో రూ.12,087 కోట్లను కేంద్రం మంజూరు చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్‌ అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఇళ్ల పైసలు కేంద్రానివేనని, మహిళ సంఘాలకు ఇచ్చే రుణాలు, చివరికి బాత్రూంలు, స్మశాన వాటికల నిర్మాణానికి ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రానివేనని  పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తన దగ్గర లెక్కలున్నాయని, ఆ లెక్కలు తప్పయితే నాపై కేసులు పెట్టి జైలుకు పంపించాలని, నిజం అని తేలితే భాగ్యనగర్‌ నడిబొడ్డున్న ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెబుతావా? అని కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు.


  పీఎం ఆవాస్‌ యోజన కింద 2,03.87 ఇళ్ల నిర్మాణానికి రూ.2.280కోట్లను నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్రం మంజూరు చేసిందని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదన్నారు. ఒక్క జీహెచ్‌ఎంసీలోనే లక్షన్నర ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని,  అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. తన పేరు మీద దొంగలేఖ రాసి పేదలకు డబ్బులు రాకుండా కుట్ర చేసిన దగుల్బాజీ సీఎం కేసీఆర్‌ అని ఆరోపించారు. 




నినాదాలతో కేసీఆర్‌, ఒవైసీ చెవుల్లోంచి రక్తం రావాలి

 బీజేపీకి భయపడే ఫాంహౌ్‌సను వీడి కేసీఆర్‌ బయటకొచ్చారని.. దుబ్బాకలో ప్రజలు దెబ్బకొడితే  హైదరాబాద్‌ గురించి ఆలోచించడం మొదలు పెట్టారని బండి సంజయ్‌ పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌లో వరదలొస్తే ఇంట్లో నుంచి కాలు బయటపెట్టని సీఎం, ప్రజలను కనీసం పలకరించని సీఎం, పారసిటిమల్‌ సీఎం, ఫౌంహౌస్‌ సీఎం మనకు అవసరం లేదు’ అని పిలుపునిచ్చారు. బాధితులకు రూ.10వేల చొప్పున బిచ్చం వేసినట్లు సీఎం వేశారని.. బీజేపీ అధికారంలోకి వస్తే రూ.25వేల చొప్పున ఖాతాల్లో వేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వేరే పార్టీ గెలిస్తే లాభం లేదని.. తమ సహకారం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘బాధ్యతను గుర్తుచేయడానికి, అహంకారాన్ని దించడానికి మిమ్మల్ని ప్రజలు ఓడిస్తారు’ అని వ్యాఖ్యానించారు.


‘పన్నుల పేరిట హైదరాబాద్‌ ప్రజలు రూ. 2లక్షల కోట్లు చెల్లిస్తే హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.67 వేలు కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్‌ గొప్పలు చెబుతున్నారు. నువ్వేమైనా హైదరాబాద్‌ ప్రజలకు బిచ్చమేస్తున్నరా. ఇక్కడి ప్రజలు చెల్లించిన పన్నుల డబ్బులు ఏమైనయ్‌’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చే నినాదాల శబ్దాలతో కేసీఆర్‌; అసదుద్దీన్‌ ఒవైసీ చెవుల్లోంచి రక్త కారాలన్నారు. ఏనాడూ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయని కేసీఆర్‌ ఈసారి బీజేపీకి, భాగ్యనగరం ప్రజలకు భయపడి మెనిఫేస్టో విడుదల చేశారన్నారు. ఆ మేనిఫెస్టో.. పాత సీసాలో కొత్త చింతకాయ పచ్చడిలా ఉందని, దాన్ని చూస్తే తనకు నవ్వొస్తోందన్నారు. పోయినసారి హెయిర్‌ సెలూన్లకు ఫ్రీ కరెంట్‌ ఇస్తానన్నారు.. ఇచ్చారా? వేల కోట్లతో రోడ్లు వేయిస్తే ఎక్కడ చూసినా గుంతలే ఎందుకున్నాయి? అని ప్రశ్నించారు.  



అమిత్‌ షాకు ఆహ్వానం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను రాష్ట్ర బీజేపీ నాయకత్వం కోరినట్లు సమాచారం. వీలు కుదిరితే తప్పకుండా వస్తానని షా హామీ ఇచ్చారని పార్టీవర్గాలు తెలిపాయి. కేంద్రమంత్రి స్మృతిఇరానీ, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌, యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్‌, తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.


తెలంగాణ దోపిడీ దొంగలపైనా..

అక్రమ చొరబాటుదారులపై సర్జికల్‌ స్ట్రయిక్‌ తప్పనిసరి అని బండి  సంజయ్‌ తేల్చిచెప్పారు. చొరబాటు దారుల ఓట్లతో గెలవాలని చూడటం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. విదేశీ విద్రోహుల మీదే కాదు.. తెలంగాణా దోపిడీ  దొంగలపై, అవినీతి, కుటుంబస్వామ్యంపైన.. కాంట్రాక్టర్ల వేలకోట్ల దోపిడీ.. డ్రగ్స్‌ దందా.. రియల్‌ ఎస్టేట్‌ దందా  మీద కూడా సర్జికల్‌ స్ట్రయిక్‌ తప్పదని ప్రకటించారు. ఎందుకు హైదరాబాద్‌ ప్రజలపై సర్జికల్‌ స్ట్రయిక్‌ చేస్తారంటూ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ప్రశ్నించగా, సంజయ్‌ కూడా ట్విటర్‌లో పైవిధంగా స్పందించారు. మద్యం తాగి ప్రభుత్వాన్ని నడపడం రాష్ట్రానికి  ప్రమాదమన్నారు.

కాగా బండి సంజయ్‌ చేసిన సర్జికల్‌ స్ట్రయిక్‌ వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ ఒవైసీ స్పందిస్తూ.. తాము 24 గంటల టైం ఇస్తున్నామని, పాతబస్తీలో ఉన్న పాకిస్థానీయులు ఎవరో తేల్చాలని సవాల్‌ చేశారు. దీనిపై సంజయ్‌, ఒవైసీ సవాలును స్వీకరించే దమ్ముందా? అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. 


దేశద్రోహులపైనే

దేశంలోకి అక్రమంగా చొరబడి సంపద కొల్లగొడుతున్న వలసదారులపై, 15 నిమిషాల సమయమిస్తే హిందువులను లేకుండా చేస్తా అన్న మత తీవ్రవాదుల పైనా సర్జికల్‌ స్ట్రయిక్‌ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. భైంసాలో హిందువుల ఇళ్లను కాలపెడితే స్పందించని వారిపైన, భారత్‌ మాతా కీ జై అనననే అనే దేశ ద్రోహుల పైన, పాకిస్థాన్‌  గెలిస్తే టపాసులు పేల్చేవారిపైన ఈ సర్జికల్‌ స్ట్రయిక్‌ ఉంటుందన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 


Updated Date - 2020-11-25T06:55:22+05:30 IST