ఎల్‌ఆర్‌ఎస్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

ABN , First Publish Date - 2020-12-17T08:41:29+05:30 IST

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ వల్ల కలిగే ప్రభావాన్ని మదింపు చేయకుండా భూ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎ్‌స)పై

ఎల్‌ఆర్‌ఎస్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ వల్ల కలిగే ప్రభావాన్ని మదింపు చేయకుండా భూ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎ్‌స)పై ముందుకెళ్లనివ్వకుండా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఏపీ,  తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన జువ్వాడి సాగర్‌ రావు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర రావు, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ అజయ్‌ రస్తోగితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న సీబీఐ, జాతీయ విపత్తు నిర్వహణసంస్థ(ఎన్‌డీఆర్‌ఎఫ్‌, కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.


వాస్తవానికి ఈ పిటిషన్‌లో కేంద్ర మంత్రిత్వ శాఖలు, సీబీఐ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, తెలంగాణ, ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు ప్రతివాదులుగా ఉన్నప్పటికీ.. మిగతా అన్ని రాష్ట్రాలనూ ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. దాంతో ఆ రాష్ట్రాలకు కూడా నోటీసులు వెళ్తాయని స్పష్టం చేసింది. 8 వారాల్లో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కె. శ్రవణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు.


వరదలు, జనసాంద్రత, పెరుగుతున్న మురికివాడలు వంటి అంశాల్లో అఽధ్యయనం చేయకుండా భూ క్రమబద్ధీకరణకు అనుమతించడాన్ని అక్రమంగా ప్రకటించాలని ఆయన అభ్యర్థించారు. సంబంధిత రాష్ట్రాల్లో అనధికార, అక్రమ లేఅవుట్ల ప్రభావాన్ని మదింపు చేయడానికి రిటైర్డ్‌ సుప్రీం కోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని, అందులో పట్టణ ప్రణాళిక, పర్యావరణ, విపత్తు నిర్వహణ, రాష్ట్రాల అధికారులను సభ్యులుగా చేర్చాలని కోరారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లను, ఇళ్లను విక్రయించిన ప్రైవేటు వ్యక్తులు, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ లేఅవుట్లకు అనుమతివ్వడం ద్వారా జరిగిన అవినీతిపై సీబీఐతో లేదా విజిలెన్స్‌తో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్‌ విన్నవించారు. 

Updated Date - 2020-12-17T08:41:29+05:30 IST