ముమ్మరంగా సహాయక చర్యలు : చీఫ్‌ విప్‌

ABN , First Publish Date - 2020-08-16T10:04:08+05:30 IST

వడ్డెపల్లి చెరువు వరదను శనివారం ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పరిశీలించారు.

ముమ్మరంగా సహాయక చర్యలు : చీఫ్‌ విప్‌

కాజీపేట టౌన్‌, ఆగస్టు 15 : వడ్డెపల్లి చెరువు వరదను శనివారం ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌,  కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పరిశీలించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌ విలేకరులతో మాట్లాడారు. నగరంలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్‌కు అందజేస్తు న్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో  18004251115 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను జిల్లా కలెక్టర్‌ ప్రకటించారని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రమా దాలకు ఆస్కారం లేకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.  


కాజీపేట: కాజీపేట వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లు, కాలనీలన్ని జలదిగ్భందమయ్యాయి. బాపూజీగర్‌, డీజిల్‌ కాలనీ, రహ్మత్‌నగర్‌, రైల్వే క్వార్టర్స్‌,  సోమిడి, చౌరస్తాలోని రోడ్లన్నీ జలమయ్యాయి. సోమిడి చెరువు మత్తడి పోసింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  


ఎల్కతుర్తి : ఎల్కతుర్తికి చెందిన గంగారపు రమేష్‌కు చెందిన పాడిగేదెలు కొట్టుకుపోయాయి. శంకరయ్యకు చెందిన గేదె మృతిచెందింది. 10 చెరువులు, 40 కుంటలు మత్తడి పోస్తున్నాయి. దండేపల్లిలో పామెర మల్లారావుకు చెందిన రేకుల షెడ్డు కూలిపోయింది. ఎల్కతుర్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లోకి నీరు చేరింది. కోతులనడుమ వాగులో లారీ కొట్టుకుపోయింది.


కమలాపూర్‌  : ఉప్పల్‌వాగు, కమలాపూర్‌ చెరువు మత్తడి పోసింది. రహదారిపై వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.  


ఐనవోలు : మండలంలో నందనం ఆకేరు వాగు ఉప్పొంగుతోంది. సుమారు 500 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది. నందనం, జగ్గయ్యగూడెం చెక్‌డ్యాంలు మత్తడి పోస్తున్నాయి. వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి (563 ) పంథిని వద్ద వరదనీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ఐనవోలు గ్రామాల్లో ఇంటి గోడలు కూలాయి. వెంకటాపూర్‌లో పలు ఇళ్లలోకి నీరు చేరింది.


ధర్మసాగర్‌ : ధర్మసాగర్‌ మండల కేంద్రంలో దబ్బెట రాజయ్యకు చెందిన ఇల్లు శనివారం కూలిపోయింది. ఎలాంటి నష్టం జరుగలేదు.


వడ్డెపల్లి/కాజీపేటటౌన్‌: వర్షం ధాటికి కేయూ-కాజీపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వడ్డెపల్లి చెరువు, ఊర చెరువు మత్తడితో సమ్మయ్యనగర్‌, జవహార్‌కాలనీ, ద్వారకాసాయి కాలనీ, శివసాయి కాలనీ తదితర కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వడ్డెపల్లి చెరువు నిండుకుండలా కనిపిస్తోంది. ప్రస్తుతం 14 ఫీట్లకు నీరు చేరడంతో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, కార్పొరేషన్‌ ఏఈ శ్రీకాంత్‌కు సమాచారం తెలిపారు. 

Updated Date - 2020-08-16T10:04:08+05:30 IST