వరవరరావుకు సూపర్‌స్పెషాలిటీ వైద్యం
ABN , First Publish Date - 2020-07-18T08:11:52+05:30 IST
భీమా-కోరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ముంబైలోని తలోజా జైల్లో ఉన్న ప్రముఖ కవి వరవరరావును ప్రైవేట్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ) ఆదేశించింది. కరోనా సోకిన ఆయనకు వైద్య ఖర్చులన్నీ

హైదరాబాద్, జూలై 17(ఆంధ్రజ్యోతి): భీమా-కోరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ముంబైలోని తలోజా జైల్లో ఉన్న ప్రముఖ కవి వరవరరావును ప్రైవేట్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ) ఆదేశించింది. కరోనా సోకిన ఆయనకు వైద్య ఖర్చులన్నీ ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్దేశించింది. వరవరరావు ఆరోగ్య పరిస్థితి, ఆయనకు అందిస్తున్న చికిత్సపై రెండు వారాల్లోగా తమకు నివేదిక అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఆ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. తలోజా జైలులో ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తమకు ఫిర్యాదులు వచ్చాయని కమిషన్ నోటీసుల్లో వివరించింది. 80 ఏళ్ల వయసు ఉన్న వరవరరావు ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నారంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది. కాగా, వరవరరావుకు ముంబైలోని సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. గురువారం ఆయనకు కొవిడ్ పాజిటివ్ రావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వరవరరావు నాడీ సంబంధ సమస్యతో బాధపడుతుండటంతో జేజే ఆస్పత్రి నుంచి నిపుణులైన న్యూరాలజిస్టులను పిలిపిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అయితే నాడీ సంబంధ సమస్య వల్ల తొందరగా స్పందించలేకపోతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొవిడ్ తీవ్రత, శ్వాసక్రియలను తెలుసుకునేందుకు తీసిన ఛాతీ ఎక్స్‌రే, ఈసీజీ, తదితర వైద్య పరీక్షల ఫలితాలు సాధారణంగానే ఉన్నాయని, వరవరరావు ఆరోగ్యంపై మరింత స్పష్టత కోసం సీటీ స్కాన్ తీయాలనుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు. కాగా, వరవరరావుకు కరోనా వైరస్ సోకిన నేపఽథ్యంలో ఆయనను వెంటనే జైలునుంచి విడుదల చేసి మెరుగైన చికిత్స అందించాలని పలు వామపక్షాలు కేంద్రాన్ని కోరాయి. భీమా- కోరేగావ్ కేసులో ఆయన్ను అక్రమంగా ఇరికించడమే కాకుండా గత 20నెలలుగా కనీసం బెయిలు రాకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయని వారు విమర్శించారు. శుక్రవారం ఇక్కడ సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన వామపక్షాల భేటీలో సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, సీపీఐ (ఎంఎల్)న్యూ డెమాక్రసీ, ఎంసీపీఐ (యు), సీపీఐ (ఎంసీ) లిబరేషన్ నేతలు పాల్గొన్నారు.
వరవరరావుకు మెరుగైన వైద్యం అందించండి: సంపత్
విరసం నేత వరవరరావుకు మెరుగైన వైద్యం అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ కోరారు. వరవరరావును హైదరాబాద్‌కు తరలించేందుకు అవకాశాలుంటే పరిశీలించాలని శుక్రవారం మహారాష్ట్ర మంత్రి అమిత్ దేశ్‌ముఖ్‌కు ఫోన్ చేసిన సంపత్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.