మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా..సునీతా లక్ష్మారెడ్డి

ABN , First Publish Date - 2020-12-28T07:48:10+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ను నియమించింది. డిసెంబరు 31లోగా రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసీఆర్‌ సర్కారు స్పందించింది. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి, మెదక్‌ జిల్లాకు చెందిన సునీతా లక్ష్మారెడ్డిని నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా..సునీతా లక్ష్మారెడ్డి

మరో ఆరుగురు సభ్యులు కూడా..

జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ ఏర్పడ్డాక తొలి చైర్‌పర్సన్‌

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణయం


హైదరాబాద్‌/నర్సాపూర్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ను నియమించింది. డిసెంబరు 31లోగా రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసీఆర్‌ సర్కారు స్పందించింది. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి, మెదక్‌ జిల్లాకు చెందిన సునీతా లక్ష్మారెడ్డిని నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. చైర్‌పర్సన్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులను కూడా నియమించింది. సహీనా అఫ్రోజ్‌, కుమ్ర ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్‌, గద్దల పద్మ, సుదాం లక్ష్మి, కటారి రేవతీరావులను మహిళా కమిషన్‌ సభ్యులుగా నియమించింది. వీరి పదవీకాలం ఐదేళ్ల పాటు ఉంటుందని జీవోలో తెలిపింది. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకున్నప్పుడల్లా మహిళా కమిషన్‌ వేయాలంటూ సామాజిక వేత్తలు చేసిన డిమాండ్లను కేసీఆర్‌ సర్కారు పట్టించుకోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ సీఎ్‌సకు లేఖ రాశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర మహిళా కమిషన్‌ 2018 జూలై నుంచి ఖాళీగా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం త్రిపురాన వెంకటరత్నాన్ని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమించింది. విభజన తర్వాత ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అక్కడ మరొకరికి చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించింది. దీంతో వెంకటరత్నం తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా 2018 జూలై వరకు కొనసాగారు. అనంతరం ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. హైకోర్టు జోక్యంతో ఎట్టకేలకు నియామకం చేపట్టింది. 


కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరి.. 

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌కు చెందిన సునీత భర్త లక్ష్మారెడ్డి శివ్వంపేట జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న సమయంలో 1999లో మరణించారు. కార్యకర్తల డిమాండ్‌ మేరకు రాజకీయాల్లోకి వచ్చిన సునీత 1999లోనే కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగి నర్సాపూర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009లో కూడా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో స్త్రీ, శిశుసంక్షేమ శాఖ, నీటిపారుదల శాఖల మంత్రిగా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు.  2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచిబరిలో నిలిచి ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆమె టీఆర్‌ఎ్‌సలో చేరారు. సముచిత స్థానం కల్పిస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎ్‌సలో చేరినప్పటి నుంచి ఏ పదవీ లేకున్నా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. 


నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: సునీత

తనను మహిళాకమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమించడం ఎంతో ఆనందంగా ఉందని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కీలకమైన బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. 

Updated Date - 2020-12-28T07:48:10+05:30 IST