ఉరేసుకుని ఇద్దరు వివాహితల ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-04-14T10:00:54+05:30 IST

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ.. రాకపోకలపై ఆంక్షలు ఉండగా.. నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు వివాహితలు సహా బాలిక ఆత్మహత్య ఘటన సోమవారం కలకలం రేపింది. కరోనా నేపథ్యంలో పంపిణీ చేస్తున్న సరుకులు

ఉరేసుకుని ఇద్దరు వివాహితల ఆత్మహత్య

  • వీరిలో ఒకరి కుమార్తెకు దోమల మందు కలిపి తాగించిన వైనం


జవహర్‌నగర్‌, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ.. రాకపోకలపై ఆంక్షలు ఉండగా.. నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు వివాహితలు సహా బాలిక ఆత్మహత్య ఘటన సోమవారం కలకలం రేపింది. కరోనా నేపథ్యంలో పంపిణీ చేస్తున్న సరుకులు తీసుకునేందుకు వెళ్లడం.. వేరొకచోట ఆశ్రయం పొందడం.. అనంతరం బలవన్మరణానికి పాల్పడటం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ సమీపంలో జరిగిన ఘటన వివరాలు కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌ కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా వేములవాడ మండలం మరిపెల గ్రామానికి చెందిన సుమతి (29).. భర్త శ్యాంకుమార్‌తో కలిసి కరీంనగర్‌లో నివసిస్తోంది. వీరి ఇంటి సమీపంలోనే శ్రీరాముల అనూష (25) ఆమె భర్త నాగరాజు, కూతురు ఉమాహేశ్వరి (8) ఉంటున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య స్నేహం పెరిగింది. కరోనా కారణంగా పేదలకు ఇస్తున్న బియ్యం, కూరగాయలను తెస్తామంటూ ఈ నెల 9న అనూష, ఉమా మహేశ్వరి, సుమతి బయటకు వచ్చారు. తిరిగి వెళ్లేసరికి రాత్రి కావడంతో నాగరాజు, శ్యాంకుమార్‌ వారిని మందలించారు. దీంతో ముగ్గురూ మళ్లీ బయటకు వచ్చేశారు. శుక్రవారం ఉదయం మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట చేరుకున్నారు. తమకు పరిచయం ఉన్న పాస్టర్‌ కుమారుడికి ఫోన్‌ చేయగా అతడు మూడు రోజుల పాటు గబ్బిలాల్‌పేటలోని చర్చిలో ఆశ్రయమిచ్చాడు. అయితే, ఆదివారం అర్ధరాత్రి వీరు చర్చి నుంచి వచ్చేశారు. ఇంతలోనే ఏమైందో ఏమో.. ఉమామహేశ్వరికి కూల్‌డ్రింక్‌లో హార్పిక్‌, ఆలౌట్‌ కలిపి తాగించి, ఆమె మృతి చెందాక చున్నీలతో మర్రి చెట్టుకు ఉరేసుకున్నారు.


అతడిని విచారిస్తే వీడనున్న చిక్కుముడి

అనూష, ఉమామహేశ్వరి జవహర్‌నగర్‌ ఎందుకొచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో శామీర్‌పేట ఎలా చేరారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఆశ్రయమిచ్చిన బండ్లగూడలో ఉండే పాస్టర్‌ కుమారుడిని విచారిస్తే చిక్కుముడి వీడే అవకాశం ఉందని చెబుతున్నారు. మనస్తాపమేనా? మరేదైనా కారణముందా? అనేది కూడా తేలనుంది.

Updated Date - 2020-04-14T10:00:54+05:30 IST