పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-29T06:06:59+05:30 IST

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామానికి చెందిన తన్నీరు గోపరాజు(19) ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

పోలీసులే కారణమంటూ మృతదేహంతో ధర్నా 


వేంసూరు, డిసెంబరు 28: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామానికి చెందిన తన్నీరు గోపరాజు(19) ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వేంసూరు పోలీసులు మందలించినందుకే గోపరాజు ఆత్మహత్య చేసుకున్నాడంటూ బంధువులు మృతదేహంతో సోమవారం ఆందోళన చేపట్టారు. కల్లూరుగూడెం గ్రామానికి చెందిన బత్తుల తిరుపతిరావు అదే గ్రామానికి చెందిన ఓ మైనర్‌ బాలికను ఈ నెల 24న ప్రేమ పేరుతో తీసుకెళ్లాడు. తరువాత కృష్ణా జిల్లా అక్కపాలెంలో ఆ బాలికను వదిలేసి తిరుపతిరావు పరారయ్యాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో వేంసూరు పోలీసులు విచారణ చేపట్టారు. తిరుపతిరావు తనపై అత్యాచారం చేశాడని బాలిక తెలిపింది.


దీంతో తిరుపతిరావు ఆచూకీ కోసం గోపరాజును పోలీసులు ఆదివారం స్టేషన్‌కు పిలిపించారు. ఆ తర్వాత గోపరాజు పొలంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు తన కుమారుడిని కొట్టినందునే గోపరాజు ఆత్మహత్య చేసుకున్నాడంటూ మృతుడి తండ్రి, బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


కాగా, గోపరాజు ఆత్మహత్యకు పోలీసుల బెదిరింపులే కారణమన్న ఆరోపణల్లో నిజం లేదని వేంసూరు ఎస్‌ఐ సాయికుమార్‌ తెలిపారు. ఓ కేసు విషయంలో తిరుపతిరావు ఎక్కడున్నా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి గోపరాజును పంపించామన్నారు. అతణ్ని తాము కొట్టలేదన్నారు.

Updated Date - 2020-12-29T06:06:59+05:30 IST