పొలం లాక్కుంటున్నారని ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-11-27T07:30:09+05:30 IST

పొలంలోకి ప్రభుత్వ అధికారులు వచ్చి సర్వే చేస్తుండటంతో ఆ వృద్ధ దంపతులు ఆందోళన చెందారు. తమ భూమిని లాక్కుంటున్నారని అక్కడే పురుగుల

పొలం లాక్కుంటున్నారని ఆత్మహత్యాయత్నం

పురుగుమందు తాగిన వృద్ధ దంపతులు

ములుగు, నవంబరు 26: పొలంలోకి ప్రభుత్వ అధికారులు వచ్చి సర్వే చేస్తుండటంతో ఆ వృద్ధ దంపతులు ఆందోళన చెందారు. తమ భూమిని లాక్కుంటున్నారని అక్కడే పురుగుల మందు తాగారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. ములుగు మండలం మహ్మద్‌గౌ్‌సపల్లికి చెందిన రొట్టె లింగమ్మ-లింగయ్య దంపతులు 1433 సర్వేనంబరులోని 17 గుంటలు, పక్కనే 1434 సర్వే నంబరులోని 10 గుంటల భూమిలో వరి పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. 1434 సర్వే నంబరులో ఉన్న భూమి ప్రభుత్వానికి చెందిందని మల్లంపల్లి-2 ఎంపీటీసీ జన్నారపు శ్రీను రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.


ఈ మేరకు గురువారం ఆర్‌ఐ, సర్వేయర్లు భూమి వద్దకు వచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు పురుగుల మందును తాగారు. అక్కడే ఉన్న గ్రామస్థులు వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. లింగమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ములుగు తహసీల్దార్‌ సత్యనారాయణస్వామి స్పందించారు.

సర్వే నంబరు 1434లో 35 గుంటల ప్రభుత్వ భూమి ఉందని, సర్వేచేసి హద్దులు ఏర్పాటు చేసేందుకు మాత్రమే తమ సిబ్బంది గ్రామానికి వెళ్లారని చెప్పారు. ఆత్మహత్యకు యత్నించిన వారిపై తాము ఎటువంటి ఒత్తిడి తేలేదన్నారు.


Read more