చెరుకు సాగు చేదు అవుతోంది!
ABN , First Publish Date - 2020-07-27T08:36:55+05:30 IST
సకాలంలో కురవని వర్షాలు.. బోరుబావుల్లో ఇంకిపోతున్న నీరు.. తగ్గిపోతున్న దిగుబడి.. గిట్టుబాటు కాని ధరలతో చెరుకు రైతులు ఆ పంట సాగుకు దూరమవుతున్నారు.

- భారీగా పడిపోయిన సాగు విస్తీర్ణం
- కూలీల కొరత.. గిట్టుబాటు ధర లేక నష్టాలు
- ఇతర పంటల వైపు చూస్తున్న చెరుకు రైతులు
కామారెడ్డి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): సకాలంలో కురవని వర్షాలు.. బోరుబావుల్లో ఇంకిపోతున్న నీరు.. తగ్గిపోతున్న దిగుబడి.. గిట్టుబాటు కాని ధరలతో చెరుకు రైతులు ఆ పంట సాగుకు దూరమవుతున్నారు. షుగర్ ఫ్యాక్టరీల యాజమాన్యాల నుంచి ప్రోత్సాహం కూడా కరువవడంతో చెరుకు సాగును వదిలి ఇతర పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో చెరుకు దిగుబడి తగ్గిపోయి తీరా ఇప్పుడు ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు ప్రధానంగా చెరుకు పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ ఏడాది సుమారు 45 వేల ఎకరాల్లో చెరుకు సాగైంది. అయితే గతంలో ఎన్నడూలేని విధంగా లోటు వర్షపాతం నమోదు కావడం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. చెరుకు అభివృద్ధి అధికారుల లెక్కల ప్రకారం ఈ ఏడాది 5 లక్షల టన్నుల చెరుకు దిగుబడి తగ్గింది. ఎకరాకు సుమారు 30 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా.. ఈ ఏడాది 15 టన్నుల వరకు మాత్రమే వచ్చింది. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాలేదు. గడచిన 20 ఏళ్లలో ఇటువంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని రైతులు వాపోతున్నారు.ఉన్న సమస్యలకు తోడు కూలీల కొరత కూడా చెరుకు రైతులను వేధిస్తోంది. ధర తక్కువగా ఉన్నా చెరుకును సరఫరా చేసేందుకు కూలీలు సైతం అందుబాటులో ఉండటం లేదు. స్థానికంగా కూలీలు లేక బయటి వారిపై ఆధారపడాల్సి వస్తోంది.
ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నందున వారు డిమాండ్ చేసినంత కూలి చెల్లిస్తేనే చెరుకును నరుకుతున్నారు. ఇది రైతులకు భారంగా మారుతోంది. కష్టనష్టాలకోర్చి కర్మాగారాలకు చెరుకును సరఫరా చేస్తే.. బిల్లులు కూడా సకాలంలో చెల్లించడంలేదు. పంట అమ్ముకుని ఏడాది కాలం గడిచేదాకా బిల్లులు రావడంలేదు. ఫ్యాక్టరీల యాజమాన్యాలు రైతులకు తగిన సౌకర్యాలు కూడా కల్పించడంలేదు. దీనికితోడు బోరుబావుల్లో రోజురోజుకూ నీరు ఇంకిపోతుండటంతో రైతులు చెరుకు పంటకు బదులు వర్షాధార పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పత్తి, కంది, శనగ తదితర పంటలను వేయాలని నిర్ణయించుకుంటున్నారు. చెరుకు సాగు విస్తీర్ణం రోజు రోజుకూ తగ్గిపోతోంది. దీంతో ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.