గాంధీ సూపరింటెండెంట్‌ ఆకస్మిక మార్పు

ABN , First Publish Date - 2020-04-21T08:53:23+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

గాంధీ సూపరింటెండెంట్‌ ఆకస్మిక మార్పు

శ్రవణ్‌ కుమార్‌ స్థానంలో రాజారావు

కరోనా కో-ఆర్డినేటర్‌గా శ్రవణ్‌ బదిలీ

కింగ్‌కోఠి ఆస్పత్రి అధిపతీ మార్పు



హైదరాబాద్‌ సిట్టీ/అడ్డగుట, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైద్య సేవలకు కీలకంగా ఉన్న గాంధీ, కింగ్‌ కోఠీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లను అకస్మాత్తుగా బదిలీ చేసింది. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌కు తెలంగాణ కరోనా సమన్వయ బాధ్యతలను అప్పగించింది.  డాక్టర్‌ శ్రవణ్‌ ఐదేళ్లుగా గాంధీ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. కరోనా వైరస్‌ మొదలైన నాటి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ అయిన డాక్టర్‌ రాజారావును గాంధీ సూపరిటెండెంట్‌గా నియమించింది. ఇది ఆయనకు పదోన్నతి. కింగ్‌కోఠిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న నర్సింగ్‌రావును సర్కారు ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఫీవర్‌ ఆస్పత్రి, ఐపీఎం డైరెక్టర్‌గా వ్యవహారిస్తున్న డాక్టర్‌ శంకర్‌కు కింగ్‌కోఠి ఆస్పత్రిని అదనపు బాధ్యతగా అప్పగించింది.


సవాల్‌ను స్వీకరిస్తా: డాక్టర్‌ రాజారావు 

కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించి, వారిని ఆరోగ్యవంతులను చేసి సంతోషంగా ఇంటికి పంపించడమే ధ్యేయంగా పని చేస్తానని డాక్టర్‌ రాజారావు ప్రకటించారు. రాజారావు 1987లో గాంధీ ఆస్పత్రిలో ఎంబీబీఎస్‌ చేశారు. 1995-96లో గాంధీలోనే పీజీ చేశారు. 1998లో ప్రొఫెసర్‌గా, 2006లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, 2011లో ఫీవర్‌ ఆస్పత్రిలో ప్రొఫెసర్‌గా పని చేశారు. 2016 నుంచి గాంధీ ఆస్పత్రిలో ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకాలం వైద్యుడిగా పని చేయడం ఒక ఎత్తయితే కరోనా వైరస్‌ సమయంలో అప్పగించిన బాధ్యతను సవాల్‌గా స్వీకరిస్తానని చెప్పారు. 

Updated Date - 2020-04-21T08:53:23+05:30 IST