రండి బాబు రండి..
ABN , First Publish Date - 2020-05-13T09:03:33+05:30 IST
‘‘సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ తెరుచుకున్నాయి. దస్తావేజుల రిజిస్ట్రేషన్లు, స్టాంపుల అమ్మకం, ఈసీల జారీ, వివాహాల నమోదు వంటి అన్ని సేవలు

- రిజిస్ట్రేషన్లు చేసుకోండి...
- పోలీసులు అడ్డుకోకుండా అనుమతి పత్రాలిస్తాం
- ఇబ్బందులుంటే వాట్సాప్ మెసేజ్‌లు పెట్టండి
- రాబడి పెంపు కోసం రిజిస్ట్రేషన్ల శాఖ తంటాలు
హైదరాబాద్, మే 12(ఆంధ్రజ్యోతి): ‘‘సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ తెరుచుకున్నాయి. దస్తావేజుల రిజిస్ట్రేషన్లు, స్టాంపుల అమ్మకం, ఈసీల జారీ, వివాహాల నమోదు వంటి అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ రోజుల్లో లాగానే కార్యాలయాలు పనిచేస్తున్నాయి. రండి బాబు రండి.. రిజిస్ట్రేషన్లు చేసుకోండి. లాక్‌డౌన్‌లో పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అనుమతి పత్రాలిస్తాం. ఏవైనా ఇబ్బందులుంటే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయండి. వాట్సాప్ మెసేజ్‌లు పెట్టండి. మీ కోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయి’’ అంటూ ఆస్తుల కొనుగోలుదారులను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అభ్యర్థిస్తోంది. రిజిస్ట్రేషన్లలో మునుపటి ఒరవడిని సాధించడానికి తంటాలు పడుతోంది.
స్లాట్‌లు బుక్ చేసుకోవాలని, ఇదివరకే వెబ్‌సైట్‌లో దస్తావేజుల వివరాలను నమోదు చేసుకుని, స్టాంపు డ్యూటీ చెల్లించినవారు వెంటనే వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కోరుతోంది. లాక్‌డౌన్‌తో రాబడి తగ్గి లక్ష్యం మేర ఆదా యం వస్తుందో లేదోనన్న ఆందోళనలో రిజిస్ట్రేషన్ల శాఖ ఉంది. అందుకే లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూ ప్ర భుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించింది. దాంతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. అయినా రిజిస్ట్రేషన్లు ఇంకా గాడి న పడలేదు. లాక్‌డౌన్‌కు ముందు నాటికి రోజూ 6000-7000 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యేవి. రోజూ రూ.25-30 కోట్ల రాబడి వచ్చేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ద్వారా రోజూ సగటున రూ.5 కోట్ల రాబడి వస్తోంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలవారీ లక్ష్యం పూర్త య్యే పరిస్థితులుండవు. అందుకే డీఐజీలు, డీఆర్‌లు ఎక్కడికక్కడ ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే అనుమతి పత్రం(పాస్) కూడా లభిస్తుందని, పోలీసుల నుంచి ఎలాంటి ఆటంకాలుండవని హైదరాబాద్(సౌత్) డీఐజీ సుబ్బారావు, డీఆర్ రవీందర్‌రావు తెలిపారు. ఆటంకాలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 18005994788కు ఫోన్ చేయాలని, లేదా 9121220272 నెంబరుకు వాట్సాప్ మెసేజ్ పెట్టాలని కోరారు. అన్ని కార్యాలయాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నామని, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 13,585 డాకుమెంట్లు రిజిస్టర్ కాగా, రూ.47.114 కోట్ల రాబడి వచ్చింది.
రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ సైట్ ద్వారా ఇప్పటివరకు రూ.61.25 కోట్ల విలువైన 21,674 చలాన్లు జనరేట్ అయ్యాయి. ఇందులో ఎక్కువగా భూముల డాకుమెంట్ల రిజిస్ట్రేషన్ సంబంధిత చలాన్లే ఉన్నాయి. చలాన్లు జనరేట్ చేసి, బ్యాంకులో డబ్బు చెల్లించి ఉంటే 4 నెల ల్లో ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చలాన్లు తీసి, రిజిస్ట్రేషన్లు చేసుకోకుండా ఉండిపోయిన కొందరికి లాక్‌డౌన్ మరో ఆటంకంగా మారింది. అలాంటివారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశముంది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ సారి రూ.10 వేల కోట్ల వార్షిక రాబడిని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ లక్ష్యం నెరవేరాలంటే నెలకు కనీసం రూ.835 కోట్ల రాబడి రావాలి. కానీ.. లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌లో పెద్దగా రాబడి రాలేదు. ఈ నెలతో కలుపుకొని ఇప్పటివరకు రూ.47.11 కోట్లు వచ్చాయి.
రిజిస్ట్రేషన్లు పుంజుకుంటున్నాయి
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. 6 రోజుల్లో 10 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.25 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా నేపథ్యంలో ఒకేసారి ఆరుగురి కంటే ఎక్కువ మందిని అనుమతించడం లేదు. కంటింజెన్సీ ఫండ్‌తో మాస్కులు, శానిటైజర్లు కొనుక్కోవాలని సబ్‌రిజిస్ట్రార్లను ఆదేశించాం.
చిరంజీవులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఇన్‌స్పెక్టర్ జనరల్