గ్రామానికో ‘స్టడీ సర్కిల్‌’

ABN , First Publish Date - 2020-07-15T08:53:10+05:30 IST

ఆన్‌లైన్‌ తరగతులకు నోచుకోని గ్రామీణ విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ శాఖ ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘విలేజ్‌ స్టడీ సర్కిల్క్‌’ మంచి

గ్రామానికో ‘స్టడీ సర్కిల్‌’

  • విద్యార్థులే ఉపాధ్యాయులు .. సాంఘిక సంక్షేమశాఖ వినూత్న ప్రయోగం
  • 600 గ్రామాల్లో  విజయవంతంగా అమలు 
  • రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ   

హైదరాబాద్‌, జూలై 14(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ తరగతులకు నోచుకోని గ్రామీణ విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ శాఖ ప్రయోగాత్మకంగా ప్రారంభించిన  ‘విలేజ్‌  స్టడీ సర్కిల్క్‌’ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. విద్యార్థులు చదువులకు దూరం కాకుండా చేస్తున్నాయి.  నెల క్రితం ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌ మండలంలో ఒక స్టడీ సర్కిల్‌ని ప్రారంభించగా,  ప్రస్తుతం ఇవి రాష్ట్ర వ్యాప్తంగా 600కు పైగా గ్రామాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి.  


ఏమిటీ ‘విలేజ్‌ స్టడీ సర్కిల్‌’..? 

సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 6 నుంచి డిగ్రీ వరకు మొత్తం 448 విద్యాసంస్థలుండగా 2 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు.  కరోనా కారణంగా ఈసారి విద్యాసంవత్సరం ప్రారంభంపై  జాప్యం జరుగుతోన్న విషయం తెలిసిందే. మరో వైపు..  ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిద్దామన్నా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది విద్యార్థుల వద్ద స్మార్ట్‌ ఫోన్లు లేవు. ఈ నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. గురుకులాల్లో గత ఐదేళ్ల నుంచి ‘ఫ్రీడం స్కూల్‌’ పేరుతో  అమలవుతున్న కార్యక్రమాన్ని దీనికి ప్రేరణగా తీసుకుంది. తొలుత ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌  మండలంలోని పలు గ్రామాల్లో ‘విలేజ్‌ స్టడీ సర్కిల్‌’ పేరుతో తరగతులు ప్రారంభించారు. సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న కనీసం 10 మంది విద్యార్థులున్న గ్రామాలను గుర్తించి అక్కడే తరగతులు ఏర్పాట్లు చేశారు. ఆసక్తి, ప్రతిభ ఉన్న విద్యార్థులు వారి సహచర విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఓ గంటపాటు తరగతులు బోధిస్తారు. అనేకగ్రామాల్లో వీటిని గ్రామ పంచాయతి కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలల ఆవరణం, చెట్ల కింద నిర్వహిస్తున్నారు.  పలు గ్రామాల్లో గ్రామపెద్దలు వారి ఇంటి ఆవరణల్లోనే తరగతులకు అనుమతిస్తున్నారు. 


అన్ని జిల్లాల్లో అమలుకు మార్గదర్శకాలు.. 

ఆదిలాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఈ విధానం విజయవంతం కావడంతో విలేజ్‌ లర్నింగ్‌ సర్కిల్స్‌ (వీఎల్సీ)  పేరుతో వీటిని రాష్ట్రవ్యాప్తంగా  ప్రారంభించాలని సాంఘిక, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం అన్ని రీజనల్‌ కోఆర్డినేటర్లు, సాంఘిక, సంక్షేమ గురుకులాల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. వీటి ఏర్పాట్లకు సంబంధించి మార్గదర్శకాలను జారీచేశారు. ప్రతి గ్రామంలో కనిష్ఠంగా 5, గరిష్ఠంగా 10 మందిని గుర్తించాలని, తరగతుల నిర్వహణకు అనువుగా ఉండే  ప్రాంతాలను గుర్తించాలని కోరారు. 6వ తరగతి నుంచి డిగ్రీ మధ్యలో చదువుతూ, బోధనపట్ల ఆసక్తి, మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్న విద్యార్థులను బోధకులుగా నియమించాలని  సూచించారు.  


విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది.. 

మా గురుకులం పరిధిలోని 48 గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం మా విద్యార్థులు బోధిస్తున్న తరగతుల్లో ఆసక్తిగా పాల్గొంటున్నారు. గురుకులాలు ప్రారంభించేవరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. 

- సువర్ణలత, ఎస్సీ గురుకుల ప్రిన్సిపాల్‌, బోధ్‌, ఆదిలాబాద్‌ 



భౌతిక  దూరం పాటిస్తూనే.. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం విద్యార్థుల్లో 20 శాతానికి మించి స్మార్ట్‌ ఫోన్లు ఉండవు. దీంతో ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా ఇప్పటికే డీడీ యాదగిరి ఛానల్‌లో జూలై 6 నుంచి పాఠాలు ప్రారంభించాం. టీవీలు కూడా లేని విద్యార్థుల కోసమని ప్రత్యేకంగా ప్రారంభించిన విలేజ్‌ స్టడీ సర్కిల్‌ విధానం విజయవంతంగా సాగుతోంది. ఈ తరగతుల్లో భౌతిక దూరం పాటించాలని,  మాస్క్‌ ఖచ్చితంగా వాడాలని కూడా చెప్తున్నాం.

- ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, కార్యదర్శి, గురుకుల విద్యాలయాల సంస్థ. 

Updated Date - 2020-07-15T08:53:10+05:30 IST