తప్పుడు అడ్రస్ వల్ల పరీక్ష రాయలేకపోయిన విద్యార్థి
ABN , First Publish Date - 2020-09-14T10:57:33+05:30 IST
హాల్‌టికెట్‌పై పరీక్ష కేంద్రం చిరునామా తప్పుగా ముద్రించడంతో ఓ విద్యార్థిని నీట్ రాయకుండానే కన్నీటి పర్యంతమవుతూ
వరంగల్ అర్బన్ ఎడ్యుకేషన్, సెప్టెంబరు 13: హాల్‌టికెట్‌పై పరీక్ష కేంద్రం చిరునామా తప్పుగా ముద్రించడంతో ఓ విద్యార్థిని నీట్ రాయకుండానే కన్నీటి పర్యంతమవుతూ వెనుదిరిగిన సంఘటన ఇది. హైదరాబాద్‌కు చెందిన నిఖాత్ ఫాతిమా అనే విద్యార్థిని తన హాల్‌టికెట్‌పై ఏవీవీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, వరంగల్ అని ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం పరీక్ష రాసేందుకు హైదరాబాద్ నుంచి అద్దె కారులో వరంగల్‌కు చేరుకుంది. పరీక్ష సమయానికి ముందుగానే హాల్‌టికెట్‌లో ఉన్న చిరునామాకు చేరుకుంది. అయితే చిరునామా గల కళాశాలలో నీట్ పరీక్ష కేంద్రమే లేకపోవడంతో తల్లితో వచ్చిన విద్యార్థిని హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎంతగానో శ్రమపడి హైదరాబాద్ నుంచి వచ్చి పరీక్ష రాయకుండానే కన్నీటి పర్యంతమవుతూ తల్లితో వెనుదిరిగి వెళ్లింది. కాగా ఫాతిమా హాల్‌టికెట్ నెంబరు హైదరాబాద్ సెంటర్ సిరీస్‌లో ఉందని నీట్ నిర్వాహక అధికారులు తెలిపారు.