వలస కూలీల అరిగోస

ABN , First Publish Date - 2020-05-09T10:44:08+05:30 IST

తిండి దొరక్క పస్తులుంటున్నామని, వెంటనే తమను స్వస్థలాలకు పంపాలంటూ యాదాద్రి జిల్లా బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద వలస కార్మికులు శుక్రవారం నిరసన వ్యక్తంచేశారు. జిల్లాలో పనిచేస్తున్న జార్ఖండ్‌, బిహార్‌, యూపీ

వలస కూలీల అరిగోస

ఆన్‌లైన్‌ న్యూస్‌నెట్‌వర్క్: తిండి దొరక్క పస్తులుంటున్నామని, వెంటనే తమను స్వస్థలాలకు పంపాలంటూ యాదాద్రి జిల్లా బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద వలస కార్మికులు శుక్రవారం నిరసన వ్యక్తంచేశారు. జిల్లాలో పనిచేస్తున్న జార్ఖండ్‌, బిహార్‌, యూపీ రాష్ర్టాలకు చెందిన 3900 మంది వలస కార్మికులను పంపించేందుకు శుక్రవారం అర్ధరాత్రి బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రెండు శ్రామిక్‌ రైళ్లు బయలుదేరాయి. దీంతో మరో 150మంది తమ సామాన్లతో బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అధికారులు వారి వివరాలను పరిశీలించి జాబితా ప్రకారం ‘మీకు ఇంకా అనుమతి రాలేదు. మీ పని ప్రదేశాలకు తిరిగివెళ్లండి’ అని సూచించారు. దీంతో తమకు సరైన తిండిలేక ఇబ్బందులు పడుతున్నామని; ఇదే రైళ్లలో తమను కూడా పంపించాలని వలస కూలీలు ఆందోళనకు దిగారు. వరుస క్రమంలో మీరు వెళ్లడానికి అనుమతి వస్తుందని; అప్పటి వరకు ఓపిక పట్టాలని పోలీస్‌ అధికారులు వారికి నచ్చజెప్పి ప్రత్యేక వాహనాల్లో వారిని పని ప్రదేశాలకు తరలించారు. కాగా హైదరాబాద్‌ నుంచి ఒడిసాకు నడుచుకుంటూ వెళుతున్న నిండు గర్భంతో ఉన్న వలస కూలీ సునీత శీల్‌ (28) అవస్థ పడుతూనే ఖమ్మం దాకా నడిచింది. ఆమెను అన్నం సేవాసంస్థకు చెందిన అంబులెన్స్‌లో ఒడిసాకు తీసుకువెళ్లి కుటుంబసభ్యులకు అప్పగించారు.  ఏపీ నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారికి నల్లగొండ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌ స్టాంపింగ్‌ వేశాకే అనుమతిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో చిక్కుకుపోయిన నిర్మల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన కూలీలు 50 మంది స్వస్థలాలకు వచ్చేలా చొరవచూపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Updated Date - 2020-05-09T10:44:08+05:30 IST