దక్షిణాన బలోపేతం!

ABN , First Publish Date - 2020-12-05T08:22:24+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో జరిపిన తీవ్రస్థాయి పోరాటం తమకు ఆశించిన విజయాన్నే కట్టబెట్టిందని బీజేపీ కేంద్ర నాయకత్వం నమ్ముతోంది. ఓటింగ్‌ శాతం ఇంకాస్త

దక్షిణాన బలోపేతం!

2023-24 నాటికి బలవత్తర శక్తిగా బీజేపీ

హైదరాబాద్‌ విజయంతో తెలంగాణపై కన్ను

మజ్లిస్‌ను దాటడంపై పార్టీలో సంతృప్తి

భావోద్వేగ ఎజెండాయే గెలిపించిందన్న వాదనలు

న్యూఢిల్లీ, డిసెంబరు 4: గ్రేటర్‌ హైదరాబాద్‌లో జరిపిన తీవ్రస్థాయి పోరాటం తమకు ఆశించిన విజయాన్నే కట్టబెట్టిందని బీజేపీ కేంద్ర నాయకత్వం నమ్ముతోంది. ఓటింగ్‌ శాతం ఇంకాస్త పెరిగి ఉండుంటే తామే నెంబర్‌ వన్‌ పార్టీగా ఆవిర్భవించి ఉండేవాళ్లమని అంటోంది. ఈ విజయం దక్షిణాదిన తమ విస్తరణకు మరింత దోహదకారి అవుతుందని పార్టీ అధికార ప్రతినిధులు సంబిట్‌ పాత్రా శుక్రవారంనాడు వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పారు. టీఆర్‌ఎ్‌సపై విజయం కంటే ఎక్కువగా - ఎంఐఎంను దాటి వెళ్లగలిగామన్న  సంతృప్తి బీజేపీలో ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులంటున్నారు.  బయటకు చెప్పకపోయినా- నిజానికి తమ ప్రధాన టార్గెట్‌ కూడా మజ్లిసేనని ఓ బీజేపీ నేత అన్నారు.


ప్రభుత్వ -వ్యతిరేకత, అభివృద్ధి లేమి మొదలైన వాటి వల్ల ఎటూ టీఆర్‌ఎస్‌ కొంత నష్టపోతుందని తమకు అంచనా ఉందని, అయితే మజ్లి్‌సను దాటి ముందుకు వెళ్లగలిగితే తామనుసరించిన హిందూత్వ ఎజెండాను మున్ముందు మరింత ముందుకు తీసికెళ్లడానికి వీలవుతుందని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఎటూ మజ్లి్‌సతో కలవక తప్పదు... ఇది మత పరంగా మరికాస్త పునరేకీకరణకు తావిస్తుందని కమలం పార్టీ అంచనాగా విశ్లేషకులు చెబుతున్నారు. టీఆర్‌ఎ్‌స-మజ్లిస్‌ కలయికను వీలైనంత ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ చేసి- నిజాం సంస్కృతిని శ్లాఘించిన కేసీఆర్‌కు చెక్‌ పెట్టడానికి తమకు అవకాశం లభిస్తుందని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా దక్షిణాదిన హిందూత్వ ఎజెండాను ఉధృతంగా తీసుకుపోవడానికి ఈ విజయం ఉపకరిస్తుందని ఆ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు.


వివిధ జాతీయ చానెళ్లలో జరిగిన చర్చల్లో పార్టీ ప్రతినిధులు జీవీఎల్‌ నరసింహారావు, సంబిట్‌ పాత్రా, విద్యాసాగర్‌రావు మొదలైన వారు మజ్లి్‌సపైనే దూకుడు ప్రదర్శించారు తప్ప టీఆర్‌ఎ్‌సను పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం. పాత బస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్‌ షా పూజలు, సర్జికల్‌ స్ట్రయిక్స్‌ వ్యాఖ్యలు, రోహింగ్యాలను ఏరేస్తామన్న ప్రకటనలు, హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మారుస్తామన్న వ్యాఖ్య.... వీటన్నింటినీ బీజేపీ నేతలు సమర్థించుకోవడం గమనార్హం. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. లవ్‌ జిహాద్‌పై నిషేధ చట్టంలాంటి నిర్ణయాలతో యడ్యూరప్ప సర్కారు హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళుతోంది.


ద్రవిడవాదం బలంగా  ఉన్న తమిళనాట ప్రస్తుతానికి హిందూత్వ నినాదం పెద్దగా పనిచేయకపోయినా- అన్నాడీఎంకేతో పొత్తు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమేర లాభిస్తుందన్నది ఆ పార్టీ అంచనా. దీనికి తోడు రాజకీయ అరంగేట్రం చేసిన రజనీకాంత్‌ ఓ రకంగా బీజేపీకి బీ-టీమ్‌గా ఉంటారన్న వాదనలున్నాయి.  ఇక కేరళలో ఇప్పటిదాకా తృతీయ పక్షంగానే ఉంటున్నప్పటికీ అక్కడ కూడా హిందూత్వ ఎజెండాను బలంగా తీసికెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీవాదులంటున్నారు.


మేమే ఏకైక ప్రత్యామ్నాయం: భూపేంద్రయాదవ్‌

తెలంగాణ వరకూ తీసుకుంటే తాము కాంగ్రె్‌సను పక్కకు నెట్టేసి టీఆర్‌ఎ్‌సకు సిసలైన ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించినట్లు బీజేపీ భావిస్తోంది. 2023-24 ఎన్నికల వేళకు కాంగ్రెస్‌ కనుమరుగవడం ఖాయమని, ఆ పార్టీ కీలకనేతలంతా తమ గూటికే వస్తారని, పోరు టీఆర్‌ఎ్‌సకు- తమకు మధ్యే ఉంటుందని బీజేపీ అంచనా. ‘ఈ అఖండమైన గెలుపు మాకో పెద్ద టానిక్‌. ఈ ఎన్నికల్లో మాదే నైతిక విజయం. రాష్ట్రంలో మేమే ఏకైక ప్రత్యామ్నాయం’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్రయాదవ్‌ అన్నారు.


టీఆర్‌ఎస్‌ వారసత్వ రాజకీయాలకు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని ఆయన పేర్కొన్నారు.  ఎంఐఎంతో కలిసి పనిచేసే టీఆర్‌ఎస్‌ కూడా భావోద్వేగ ఎజెండా అమలు పరచక తప్పదని, హిందూ ఓటుబ్యాంకును సంఘటితం చేసుకుని తాము దూసుకుపోతామని కమలం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‘కారు... సారు... ఇకరారు...’ అన్న నినాదం ఎత్తుకున్నారు.  


Updated Date - 2020-12-05T08:22:24+05:30 IST