ఆగని ‘ఆక్సిజన్‌’ దందా

ABN , First Publish Date - 2020-07-14T08:50:13+05:30 IST

ఆయువును కాపాడే ప్రాణ వాయువు.. కొందరికి వ్యాపార వస్తువుగా మారింది. ప్రాణాల కంటే

ఆగని ‘ఆక్సిజన్‌’ దందా

  • 40 సిలిండర్లు స్వాధీనం.. మరో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఆయువును కాపాడే ప్రాణ వాయువు.. కొందరికి వ్యాపార వస్తువుగా మారింది. ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదని చెప్పే మనుషులే  పక్కా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారు. కరోనా కాలంలో ఇష్టారాజ్యంగా సాగుతున్న ఆక్సిజన్‌ సిలిండర్ల అమ్మకాలే దీనికి నిదర్శనం. అయితే, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ దందాపై పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. లైసెన్సు లేకుండా, డిమాండ్‌ దృష్ట్యా ధర పెంచి అమ్మేవారిపై టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఉక్కుపాదం మోపుతున్నారు. సోమవారం ఇద్దరు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ విక్రయదారులను పట్టుకోవడం వరుసగా ఇది నాలుగో రోజు. కాగా, ఆక్సిజన్‌ సిలిండర్లు నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో ముషీరాబాద్‌లోని జుజు కిడ్స్‌జోన్‌ అండ్‌ స్టేషనరీ షాప్‌పై దాడులు నిర్వహించిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముషీరాబాద్‌ నివాసి నిసార్‌ అహ్మద్‌ (41), అతడికి సహకరిస్తున్న జీడిమెట్ల నివాసి ఎన్‌.వెంకట సుబ్బారావు (51)ను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 40 ఆక్సిజన్‌ సిలిండర్లు (14.5 కేజీలవి) స్వాధీనం చేసుకున్నారు. నిసార్‌ అహ్మద్‌ జీడిమెట్లలోని శ్రీనిధి ఎయిర్‌ ప్రొడక్ట్స్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న వెంకట సుబ్బారావు వద్ద నుంచి సిలిండర్లు కొని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నాడు. గుజరాత్‌ నుంచి ఖాళీ సిలిండర్లను కొని ఆక్సిజన్‌ నింపి నిసార్‌కు అమ్ముతున్నట్లు సుబ్బారావు విచారణలో పోలీసులకు చెప్పాడు.


పెరిగిన అక్రమ దందా

సాధారణంగా ఆక్సిజన్‌ సిలిండర్ల వ్యాపారం చేయాలంటే... ఔషధంగా ఉపయోగించే పరికరమైనందున డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ, డిమాండ్‌ దృష్ట్యా వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. సిలిండర్లు కొనుగోలు చేసి విక్రయించే దందాలో నిమగ్నమయ్యారు. కొరత దృష్ట్యా ధరలు పెంచి విక్రయిస్తూ బ్లాక్‌ మార్కెట్‌కు కూడా పా ల్పడుతున్నారు. అవసరాల దృష్ట్యా ప్రతి బస్తీలో ఆక్సిజ న్‌ సిలిండర్లు తరలించే వ్యాపారులు పుట్టుకొస్తున్నారు.


అయినా కొరత..

ఆక్సిజన్‌ సిలిండర్లు విక్రయించే వ్యాపారులకు గతంలో రీ ఫిల్లింగ్‌, సిలిండర్ల అవసరం నిమిత్తం అతి తక్కువ కాల్స్‌ వచ్చేవి. ఓ వ్యాపారిని అడగ్గా.. నెలకు సుమారు 50 నుంచి 60 వరకు కాల్స్‌ వచ్చేవని, అందులో ఎక్కువగా ఆస్పత్రులవేనని చెప్పారు. కానీ ప్రస్తుతం సిలిండర్‌ లేదా రీ ఫిల్లింగ్‌ కోసం రోజూ 150 నుంచి 200 వరకు కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు. కరోనా కేసుల దృష్ట్యా ఆక్సిజన్‌ సిలిండర్లకు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. నిల్వలు అయిపోవడం.. కొత్త సిలిండర్లు లభించకపోవడంతో లైసెన్సు లేని వారు సైతం మార్కెట్‌లోకి వస్తున్నారు.


బాధితుల ఆందోళన

ఆక్సిజన్‌ సిలిండర్ల వ్యాపారులను పోలీసులుఅరెస్టు చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన పెరిగింది. నేరుగా విక్రయించే మార్కెట్లలో ఆక్సిజన్‌ సిలిండర్లే లేవు. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించి కొరత లేకుండా, అవసరం ఉన్నవారు కొనుగోలు చేసేలా చూడాలని రోగుల బంధువులు కోరుతున్నారు. కాగా, కొందరు మానవతా దృక్పధంతో సిలిండర్లు కొనుగోలు చేసి స్వచ్ఛందంగా రోగులకు అందజేస్తున్నారని ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్‌ చెప్పారు. ఆస్పత్రుల్లో బెడ్‌లు ఖాళీగా లేనప్పుడు, ఇళ్లల్లో ఉండి చికిత్స పొందాలని ప్రభుత్వాసుపత్రులు చెబుతున్నప్పుడు.. సిలిండర్లు అందుబాటులో లేకుంటే పరిస్థితి ఏమిటని ఖాన్‌ ప్రశ్నించారు.

Updated Date - 2020-07-14T08:50:13+05:30 IST