ఏడుపాయల గుట్టల్లో రాతియుగం వర్ణ చిత్రాలు

ABN , First Publish Date - 2020-11-26T08:40:03+05:30 IST

మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల గుట్టల్లో నాలుగు వేల సంవత్సరాల నాటి రాతియుగానికి చెందిన ఆనవాళ్లు వెలుగు చూశాయి.

ఏడుపాయల గుట్టల్లో రాతియుగం వర్ణ చిత్రాలు

 4 వేల ఏళ్ల నాటివిగా పరిశోధనలో వెల్లడి

పాపన్నపేట, నవంబరు 25 : మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల గుట్టల్లో నాలుగు వేల సంవత్సరాల నాటి రాతియుగానికి చెందిన ఆనవాళ్లు వెలుగు చూశాయి.

రెండు రోజులుగా పురావస్తు శాఖ పరిశోధకుల బృందం ఏడుపాయల గుట్టల్లో అన్వేషిస్తోంది. బుధవారం నాగ్సాన్‌పల్లి గ్రామ శివారులోని ఏడుపాయల గుట్టల పరిసర ప్రాంతాల్లో చరిత్ర పరిశోధకుడు ఎం.ఎస్‌. శ్రీనివాసన్‌ బృందం పర్యటించి, రాతియుగానికి చెందిన జింక, గుడ్డెలుగు వంటి రేఖా చిత్రాలను గుర్తించి శిలలను సేకరించారు.


ఈ సందర్భంగా శ్రీనివాసన్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ నాగ్సాన్‌పల్లి గ్రామ శివారు నుంచి ప్రవహిస్తున్న మంజీర నది, దానికి ఆనుకొని ఉన్న పెద్దపెద్ద గుట్టల్లో రాతియుగం నాటి ఆనవాళ్లు, కొన్ని లిపిలను గుర్తించామని చెప్పారు. ఏడుపాయల గుట్టల్లో అప్పటి గృహ ఆవాసాలు(రాక్‌ షెల్టర్స్‌)  పరిశీలించామన్నారు.

ఏడుపాయల అడవుల్లోని గుర్రం గుండుగా పిలుస్తున్న రాతిపై వర్ణ చిత్రాలను గుర్తించామని చెప్పారు. అవి సుమారు 4 వేల సంవత్సరాల క్రితం నాటివై ఉండవచ్చని అన్నారు. అద్భుతమైన ఈ వర్ణ చిత్రాలను, కొన్ని బ్రాహ్మి లిపిగా భావిస్తున్న రాతలను చెదిరిపోకుండా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 


మరో ప్రాంతంలోని జింకలగుండు వద్ద కొత్త రాతియుగం నాటి అవశేషాలు ఉన్నాయని తెలిపారు. ఈ వర్ణ చిత్రాలను మొదట మెదక్‌ వాస్తవ్యుడు బి.శంకర్‌రెడ్డి వెలుగులోకి తెచ్చారని చెప్పారు.  పరిశీలన బృందంలో బి.నాగరాజు, ఎం.అరుణ్‌కుమార్‌, ప్రశాంత్‌, నరేష్‌, కృష్ణ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2020-11-26T08:40:03+05:30 IST