బైక్‌లతో జర భద్రం!

ABN , First Publish Date - 2020-09-03T09:39:06+05:30 IST

రయ్యుమంటూ గాల్లో తేలిపోయే వేగంతో బైక్‌లపై దూసుకెళ్లే యువత.. ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్రంలో సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లోనే ఎక్కువ మంది

బైక్‌లతో  జర భద్రం!

  • ప్రాణాలు తీస్తున్న ద్విచక్ర వాహనాలు
  • 2019లో రోడ్డు ప్రమాదాల్లో 
  • 6964 మంది మృతి
  • బైక్‌ ల వల్లే 3185 మంది దుర్మరణం
  • అతివేగానికి 5,602 మంది ప్రాణాలు బలి
  • రాత్రివేళల్లో ప్రమాదాలు ఎక్కువ
  • ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రయ్యుమంటూ గాల్లో తేలిపోయే వేగంతో బైక్‌లపై దూసుకెళ్లే యువత.. ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్రంలో సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2019లో తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 6,964 మంది మరణించగా.. అందులో 3,185 మంది ద్విచక్రవాహనాల వల్లే మృత్యువాత పడ్డారు. ఈ మృతుల్లో బైక్‌ నడిపినవారు 1325 మంది ఉండగా, ఇతరులు 1860 మంది ఉన్నారు. జాతీయ నేర రికార్డుల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) ఈ గణాంకాలను వెల్లడించింది. ‘యాక్సిడెంటల్‌ డెత్స్‌ అండ్‌ సూసైడ్స్‌ ఇన్‌ ఇండియా-2019’ నివేదికను ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసింది. దీని ప్రకారం.. 2019లో రాష్ట్రంలో మొత్తం 21,570 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిలో 6,964 మంది మరణించారు. 21,999 మంది గాయాలపాలయ్యారు. అయితే 2018తో పోల్చితే 2019లో ప్రమాదాలు 3శాతం తగ్గినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. ఇక మొత్తం ప్రమాదాల్లో ఎక్కువగా అతివేగం వల్లే 16,723 ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో 5,602 మంది బలయ్యారు. 17,301 మంది క్షతగాత్రులయ్యారు. 


అంతర్గత రోడ్లపైనే అధికం..

రాష్ట్రంలో అంతర్గత రోడ్లపైనే ప్రమాదాలు ఎక్కువగా జరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. మొత్తం 21,570 రోడ్డు ప్రమాదాల్లో 11,717 గ్రామీణ, లింక్‌ రోడ్లపై జరిగినట్లు తెలిపింది. ఈ ప్రమాదాల్లో 11,794 మంది గాయాలపాలవగా.. 3,622 మంది దుర్మరణం చెందారు. 

హైదరాబాద్‌లో 2,649 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే.. అందులో 1980 ప్రమాదాలు అంతర్గత రోడ్లపైనే జరిగాయి.

జాతీయ రహదారులపై 7,349 ప్రమాదాలు జరిగి 2,384 మంది చనిపోయారు.

రాష్ట్ర రహదారులపై 2,501 ప్రమాదాలు సంభవించాయి. 2,614 మంది గాయాలపాలవగా.. 958 మంది మరణించారు. 


రాష్ట్రంలో ప్రమాదాలు ఇలా..

  1. ఓవర్‌టేకింగ్‌ వల్ల 3,468 ప్రమాదాలు జరిగి.. 695 మంది మరణించారు. 
  2. మద్యం సేవించి వాహనాలు నడపడంతో 140 ప్రమాదాలు జరిగాయి. 177 మంది మరణించగా 139 మంది గాయాలపాలయ్యారు. 
  3. లారీ ప్రమాదాల్లో 855 మంది, ఆర్టీసీ బస్సుల ప్రమాదాల్లో 315 మంది, కార్ల ప్రమాదాల్లో 1210 మంది, ట్రాక్టర్‌ ప్రమాదాల్లో 243, ఆటోల ప్రమాదాల్లో 668 మృత్యువాత పడ్డారు. 
  4. హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదాల్లో 2649 మంది గాయపడగా.. 271మంది మరణించారు.
  5. రాత్రివేళల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు 4,556 ప్రమాదాలు జరిగాయి.
  6. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 4,192 ప్రమాదాలు సంభవించాయి. 
  7. రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రమాదాలు తక్కువగా జరుగుతుంటే.. హైదరాబాద్‌లో ఎక్కువగా జరుగుతున్నాయి.
  8. రాష్ట్రంలో గత మార్చిలో అత్యధికంగా 2011 ప్రమాదాలు జరిగాయి. 
  9. మే నెలలో 1979, డిసెంబరులో 1976, జూన్‌లో 1928, నవంబరులో 1864 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 
  10. పాఠశాలల సమీపంలో 310 ప్రమాదాలు సంభవించగా.. 540 మంది దుర్మరణం చెందారు. 
  11. దేవాలయాలు, చర్చీలు, మసీదుల వద్ద జరిగిన ప్రమాదాల్లో 510 మంది మరణించారు.

Updated Date - 2020-09-03T09:39:06+05:30 IST