ఆదాయం మెరుగు
ABN , First Publish Date - 2020-09-03T09:27:17+05:30 IST
కరోనా దెబ్బకు దారుణంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం గత మూడు నెలలుగా క్రమంగా పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే... ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది.

- ఆగస్టులో వచ్చింది 13 వేల కోట్లు
- మూడు నెలలుగా రాష్ట్ర ఆదాయం పెరుగుదల
- గాడిలో పడుతున్న జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల రాబడి
- ఏప్రిల్, మేతో పోలిస్తే.. ప్రస్తుతం మెరుగు
- అక్టోబరుకు అందుకోనున్న అంచనాలు!
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరోనా దెబ్బకు దారుణంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం గత మూడు నెలలుగా క్రమంగా పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే... ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం అంచనా వేసిన విధంగా ఆదాయం రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కరోనా కారణంగా లాక్‌డౌన్‌ను విధించడంతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏప్రిల్‌లో ఏకంగా 83 శాతం ఆదాయాన్ని కోల్పోయినట్టు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏప్రిల్‌లో జీఎస్టీ, ఐజీఎస్టీ, సేల్ ట్యాక్స్, మద్యం ఆదాయంతోపాటు కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను కూడా కలుపుకొని రూ.3,377 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. ఇక మే నెలలో రూ.4,354 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్‌లో మరికొంత పెరిగి రూ.6,975 కోట్లు వచ్చింది.
జూలైలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.450 కోట్లు, మద్యం ద్వారా రూ.2,506 కోట్లతోపాటు జీఎస్టీ ద్వారా రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇక ఆగస్టులో మద్యం, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7 వేల కోట్లకు పైగా రాగా, జీఎస్టీ ద్వారా 2,793 కోట్లు సమకూరాయి. ఇతర ఆదాయాన్ని కూడా కలుపుకొంటే.. ఆగస్టులో సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో లాక్‌డౌన్‌ను మరింత స్థాయిలో ఎత్తివేయడంతో రాష్ట్ర ఆదాయం ఇంకా పెరుగుతుందని, ఒకటి రెండు నెలల్లో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబరు, అక్టోబరు నాటికి బడ్జెట్‌లో అంచనా వేసిన స్థాయిలో ఆదాయం వచ్చే పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో నిర్మాణ రంగంతోపాటు ఇతర రంగాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో హోటళ్లు, ఇతర సేవా రంగాల కార్యకలాపాలు కూడా తిరిగి పుంజుకుంటే.. అనుకున్న మేర ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
మరో రూ.1500 కోట్ల రుణం !
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.1500 కోట్ల రుణం తీసుకుంది. మంగళవారం బాండ్లను వేలం వేసి ఈ మొత్తాన్ని స్వీకరించింది. దీనిని 30 ఏళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లిస్తారు. ఈ రుణానికి 6.71 శాతం వడ్డీ చెల్లించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం వాటిల్లడంతో.. ప్రభుత్వం అవసరాల కోసం ఎక్కువగా రుణాలపైనే ఆధారపడింది. ఏప్రిల్, మే, జూన్‌లలో నెలకు రూ.4 వేల కోట్లకు పైగా రుణాలను తీసుకుంది. జూలై నుంచి రాబడి కొంత పెరగడంతో రుణ స్వీకరణను తగ్గించింది. మొత్తంగా ఇప్పటివరకు బాండ్ల వేలం ద్వారా రూ.15,961 కోట్ల రుణాలను తీసుకుంది.
రిజిస్ట్రేషన్ల రాబడి రూ.460 కోట్లు..
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల రాబడి కొంత పర్వా లేదనిపిస్తోంది. కరోనా విజృంభణతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు రావాలంటేనే జనం జంకుతున్నారు. లే-అవుట్ అప్రూవల్స్, బిల్డింగ్ ప్లాన్లు లేకపోతే రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆగస్టు రాబడిలో పెరుగుదల నమోదైంది. జూలై కంటే 2.17 శాతం అధిక ఆదాయం సమకూరింది. మొత్తమ్మీద క్రమంగా పెరుగుదల నమోదవుతోంది. కరోనా కారణంగా రాష్ట్రంలోని 141 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కలిపి ఏప్రిల్‌లో 4500 డాకుమెంట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. రూ.21 కోట్ల రాబడి వచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మే 6 నుంచి పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్లకు అనుమతించడంతో అప్పటినుంచి ఆదాయం పెరుగుతూ వస్తోంది. రోజూ సగటున రూ.6-7 కోట్లతో మే నెలలో రూ.190 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి ట్రాక్‌లో పడ్డాయి.
జూన్‌లో 1,40,560 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయి, రూ.460 కోట్ల రాబడి వచ్చింది. జూలైలో రాబడి రూ.10 కోట్లు తగ్గి రూ.450 కోట్లు మాత్రమే సమకూరాయి. ఆగస్టులో మళ్లీ రూ.460 కోట్ల రాబడి వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వం రూ.10 వేల కోట్ల రాబడిని బడ్జెట్‌లో అంచనా వేసింది. అంటే నెలకు రూ.833 కోట్లు రావాలి. ప్రస్తుతం నెలకు రూ.450 కోట్ల వరకే వస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం రూ.1581 కోట్ల రాబడి సమకూరినట్లయింది. మొత్తం 4,64,610 డాకుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి.
బాండ్ల రూపంలో రుణాలు (కోట్లలో)
నెల రుణం
ఏప్రిల్ 4,000
మే 4,000
జూన్ 4,461
జూలై 2,000
సెప్టెంబరు 1,500
మొత్తం 15,961