మ్యుటేషన్ల సంగతేంటి?

ABN , First Publish Date - 2020-12-07T09:32:39+05:30 IST

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటే మ్యుటేషన్లు చేయాలంటూ రాష్ట్ర మునిసిపల్‌ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో అత్యంత ముఖ్యమైన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ప్రస్తావన లేదు. మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసి, జీహెచ్‌ఎంసీ భవనాలు, స్థలాలు, ఓపెన్‌ ప్లాట్ల మ్యుటేషన్లపై ఎందుకు స్పష్టతనివ్వలేదన్న సందేహాలున్నాయి

మ్యుటేషన్ల సంగతేంటి?

మార్గదర్శకాల్లో జీహెచ్‌ఎంసీ ప్రస్తావన లేదు

మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకే వర్తింపు

గ్రేటర్‌లో 20 లక్షలకు పైగా ఆస్తులు

ఇప్పటి వరకూ మ్యుటేషన్లు తక్కువే

ధరణితో మ్యుటేషన్లకు ఎగబడే అవకాశం


హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటే మ్యుటేషన్లు చేయాలంటూ రాష్ట్ర మునిసిపల్‌ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో అత్యంత ముఖ్యమైన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ప్రస్తావన లేదు. మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసి, జీహెచ్‌ఎంసీ భవనాలు, స్థలాలు, ఓపెన్‌ ప్లాట్ల మ్యుటేషన్లపై ఎందుకు స్పష్టతనివ్వలేదన్న సందేహాలున్నాయి. ఆస్తి పన్ను బకాయిలు, ఇతర బకాయిలు లేవంటూ మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్ల నుంచి, విద్యుత్తు బకాయిలు లేవంటూ డిస్కంల నుంచి ‘నో డ్యూ సర్టిఫికెట్లు’ తెస్తేనే... రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయాలంటూ సబ్‌-రిజిస్ట్రార్లను మునిసిపల్‌ శాఖ ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా చేపట్టాలంటూ గురువారం మ్యుటేషన్‌ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు జీహెచ్‌ఎంసీకి వర్తించవని స్పష్టం చేసింది. నిజానికి జీహెచ్‌ఎంసీలోనే ఎక్కువగా ఆస్తుల వివాదాలున్నాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 20 లక్షలకు పైగా ఆస్తులున్నాయి. వీటిలో భవనాలు, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లతో పాటు ఓపెన్‌ ప్లాట్లు కూడా ఉన్నాయి. వేల సంఖ్యలో ఆస్తులు తరచూ చేతులు మారుతున్నాయి. ఇవన్నీ సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ అవుతూ వచ్చాయే తప్ప చాలా ఆస్తులు మ్యుటేషన్లకు నోచుకోలేదు.


దీనిపై కొనుగోలుదారులు పెద్దగా శ్రద్ధ పెట్టక పోవడమే కారణం. ఎలాగూ ఇతరులకు అమ్ముదామనుకునే వారు మ్యుటేషన్లు చేయించుకోలేదు. జీహెచ్‌ఎంసీ కూడా తనంతతానుగా మ్యుటేషన్లు చేయలేదు. ఎవరైనా దరఖాస్తు చేసుకుని, నిర్దేశిత ఫీజును చెల్లిస్తేనే... మ్యుటేషన్లు చేసింది. మ్యుటేషన్లు జరగని ఆస్తులకు సంబంధించి స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ‘కార్డ్‌’ సాఫ్ట్‌వేర్‌లో ఒక పేరు, జీహెచ్‌ఎంసీ ‘రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌’లో మరొకరి పేరు ఉన్నాయి. చాలా ఆస్తులకు పూర్వీకుల పేర్లే రికార్డ్‌ అయి ఉన్నాయి. ఆస్తులు చేతులు మారినా రికార్డుల్లో మార్పులు జరగలేదు. ఇలాంటి ఆస్తులకు సంబంధించి మ్యుటేషన్లు చేయించుకోవడానికి భవిష్యత్తులో చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు.


ఇదివరకు మ్యుటేషన్ల కోసం వెళితే రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందన్న కారణంతో మ్యుటేషన్లు చేయించుకోలేదు. కానీ... ఇప్పుడు ధరణి ద్వారా కేవలం 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతాయని చెబుతున్నారు. దీంతో జనం ఎగబడే అవకాశాలున్నాయి. మిగతా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు అనుమతించినట్లుగానే జీహెచ్‌ఎంసీలో మ్యుటేషన్లకుఎందుకు అనుమతించలేదన్న సందేహాలున్నాయి. జీహెచ్‌ఎంసీకి కూడా మ్యుటేషన్ల ఉత్తర్వులను జారీ చేస్తే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు తిరిగి ప్రారంభమయ్యే లోపు పన్ను బకాయిలను క్లియర్‌ చేసుకునే వాళ్లం కదా అని నగర వాసులు అంటున్నారు. 


ట్రయల్‌ రన్‌లో సాంకేతిక సమస్యలు

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించడానికి అనువుగా ధరణి పోర్టల్‌ను సన్నద్ధం చేస్తున్నారు. ధరణి పోర్టల్‌కు రాష్ట్రంలోని 141 సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలను అనుసంధానించారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా సబ్‌-రిజిస్ట్రార్లను రోజుకు ఐదేసి డమ్మీ రిజిస్ట్రేషన్లు చేయాల్సిందిగా ఆదేశించారు. డమ్మీ రిజిస్ట్రేషన్లలోనూ రకరకాల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఽపోర్టల్‌లో ‘నాన్‌-అగ్రికల్చర్‌’ ఆప్షన్‌ను పెట్టి సబ్‌-రిజిస్ట్రార్లకు యాక్సెస్‌ ఇచ్చారు. వారం రోజులుగా డమ్మీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. సేల్‌ డీడ్‌, అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ కమ్‌ జీపీఏ, డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ కమ్‌ జీపీఏ, పార్టీషన్‌, సక్సెషన్‌, మార్టిగేజ్‌ డీడ్లను ట్రయల్‌ రన్‌లో చేస్తున్నారు. ‘సిటిజన్‌ లాగిన్‌’లో ప్రజలు స్లాట్‌ బుక్‌ చేయాలి. ఈ స్లాట్‌లో అమ్మకందారు, కొనుగోలుదారు, స్థలం విస్తీర్ణం, చిరునామా, స్టాంపు డ్యూటీ చలానా వివరాలను ఎంట్రీ చేసి నిర్దేశిత సమయాన్ని ఎంట్రీ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో ఈ స్లాట్ల వివరాలు ధరణి ఆపరేటర్‌ లాగిన్‌లో ఓపెన్‌ కావడం లేదు.


పోర్టల్‌ నెట్‌వర్క్‌ తరచూ స్తంభిస్తోంది. ఆపరేటర్‌ లాగిన్‌లో ఓపెన్‌ అయిన స్లాట్ల వివరాలను పరిశీలించి, కొనుగోలుదారులు, అమ్మకందారులు, సాక్షుల ఫొటోలు తీయాలి. ఆధార్‌ ఫొటోలతో సరి చూసుకోవాలి. గతంలో ఫొటోలలోని వ్యక్తులు తారుమారై దొంగ రిజిస్ట్రేషన్లు జరిగిన సందర్భాలున్నాయి. అందుకే ధరణిలో ఐరి్‌స(కనుపాపలు)ను కూడా అందుబాటులో తెచ్చారు. కనుపాపలను కూడా ఫొటో తీస్తున్నారు. అనంతరం డాకుమెంట్లను అప్‌లోడ్‌ చేసి, సబ్‌-రిజిస్ట్రార్‌కు పంపాలి. సబ్‌-రిజిస్ట్రార్‌ డాకుమెంట్లను పరిశీలించి, డిజిటల్‌ సంతకం చేస్తారు.


ఇదంతా 10-15 నిమిషాల్లో పూర్తవుతుంది. ప్రతి స్టేజీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. స్లాట్‌లో 10 దశలుగా వివరాలు పొందుపరిస్తే ఏదో ఒక దశలో నెట్‌వర్క్‌ స్తంభించి పోతోంది. కొన్ని కేసుల్లో అన్ని వివరాలను ఎంట్రీ చేసి సేవ్‌ కొట్టినప్పుడు సేవ్‌ కాకుండా బఫరింగ్‌(చక్రం గిరా గిరా తిరగడం) అవుతోంది. సేవ్‌ కాకుండా వివరాలు ఎగిరిపోతున్న సందర్భాలుంటున్నాయి. మళ్లీ మొదటి నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాల్సి వస్తోంది. కొంతమంది సబ్‌-రిజిస్ట్రార్లు రోజంతా కష్టపడినా ఒకటి రెండు డమ్మీ రిజిస్ట్రేషన్లే పూర్తి చేస్తున్నారు. భవిష్యత్తులో ఒక్కో కార్యాలయం ద్వారా దాదాపు 40-50 రిజిస్ట్రేషన్లు చేపట్టాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న సందేహాలున్నాయి.


వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై వీడని సందేహాలు

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను తిరిగి ప్రారంభించడంపై ఇంకా సందేహాలు వీడడం లేదు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి 88 రోజులు గడిచాయి. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. బహిరంగ మార్కెట్‌లో నగదు లిక్విడిటీ తగ్గింది. ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్లు సాగితేనే రియల్‌ ఎస్టేట్‌ రంగం వృద్ధి చెందుతుంటుంది. భవన నిర్మాణాలు జోరుగా సాగుతాయి. కూలీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లకు పని దొరుకుతుంది. సిమెంటు, ఇటుక, స్టీల్‌ కొనుగోళ్లు పెరుగుతాయి. వీటన్నింటిపై ప్రభుత్వానికి వస్తు సేవల పన్ను వసూలవుతుంది.


రిజిస్ట్రేషన్ల స్టాంపు డ్యూటీ ఒనగూరుతుంది. ఇన్ని రంగాలతో ముడిపడి ఉన్న రిజిస్ట్రేషన్లను తిరిగి ప్రారంభించక పోవడంపై అనేక విమర్శలొస్తున్నాయి. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేవరకైనా పాత పద్ధతిలో ‘కార్డు(కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌)’ సాఫ్ట్‌వేర్‌ ద్వారా రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని కోరుతున్నారు. ప్రభుత్వం కోర్టు వైపు చూస్తోంది. అక్కడి నుంచి స్పష్టత వస్తేగానీ రిజిస్ట్రేషన్లను ప్రారంభించబోమని చెప్పింది. ధరణిలో ఆస్తుల నమోదు కేసుకు సంబంధించి 8 వరకు హైకోర్టు స్టేను పొడిగించింది. దీంతో ఇప్పట్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయా? అన్న సందిగ్ధత నెలకొంది. ఉన్నతాధికారులు సైతం దీని గురించి ఏమీ చెప్పలేకపోతున్నారు.

Updated Date - 2020-12-07T09:32:39+05:30 IST