ఏదయా మీదయా?

ABN , First Publish Date - 2020-11-21T09:11:02+05:30 IST

కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో ఒక్క రూపాయి కూడా కోత లేదు. పైగా డీఏ కూడా ప్రకటించారు. రైల్వే ఉద్యోగులకు

ఏదయా మీదయా?

కేసీఆర్‌ తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన

అసెంబ్లీ ఎన్నికల ముందు పీఆర్సీ ప్రకటన

రెండేళ్లు గడిచినా వేతన సవరణ అక్కడే

మిగిలిన రెండు డీఏలూ పెండింగులోనే

కరోనా కాలంలో వేతనాల్లో కోత రాష్ట్రంలోనే

జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకిచ్చిన హామీలూ అంతే

నిర్వీర్యమవుతున్న ఆర్టీసీ, ఇతర కార్పొరేషన్లు

ఉనికి కోల్పోతున్న రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలు

వాటి ఉద్యోగులకూ ఉద్యోగ, వేతన భద్రత కరువు

కార్పొరేషన్లకు కాకుండా కేంద్ర సంస్థలకు అండనా?

జీహెచ్‌ఎంసీ సహా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి


అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ముందు పీఆర్సీ ఏర్పాటు ప్రకటన! దుబ్బాక ఉప ఎన్నిక ముందు డీఏ! మినీ అసెంబ్లీ సమరం వంటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు మాకేంటి!? ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురు చూపు! ఎన్నికల ముందు ఉద్యోగులకు ప్రభుత్వాలు తీపికబురు చెప్పడం ఉమ్మడి రాష్ట్రం నుంచీ వస్తున్న ఆనవాయితీ! పీఆర్సీ సహా ఉద్యోగుల డిమాండ్లూ ఎంతో కాలంగా పెండింగులో ఉన్నవే! అందుకే వారిలో గంపెడాశ! ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో మిగిలింది నిరాశే!!


హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో ఒక్క రూపాయి కూడా కోత లేదు. పైగా డీఏ కూడా ప్రకటించారు. రైల్వే ఉద్యోగులకు ఎప్పట్లాగే బోనస్‌ ప్రకటించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా తమ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరాలూ ప్రకటించింది. రూ.10 వేలు వడ్డీ లేని రుణం ఇచ్చింది. ఎల్టీసీ మొత్తాన్ని నగదు రూపంలో అందించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. అసెంబ్లీ ఎన్నికల ముందు వేతన సవరణను ప్రకటించారు. 2018 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి ఇప్పటి వరకూ మోక్షం కలగలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి, మరొకటి జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అంతేనా, కరోనా కాలంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే వేతనాల్లో కోతను అమలు చేశారు. ఏకంగా మూడు నెలలపాటు దీనిని కొనసాగించారు. హైకోర్టు జోక్యంతో తర్వాత తిరిగి చెల్లించినా.. ఉద్యోగులతోపాటు పింఛనుదారుల పింఛన్లలోనూ కోత విధించారు. ఈ నేపథ్యంలోనే, కేంద్రం పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు అండగా ఉంటామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


రైల్వే స్టేషన్లో చాయ్‌ అమ్మిన ప్రధాని మోదీ మొత్తంగా రైల్వేను అమ్మకానికి పెట్టారంటూ చేసిన విమర్శను, ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తప్పుబట్టడాన్ని గుర్తు చేస్తున్నారు. తమను, తమ ప్రయోజనాలను పట్టించుకోవటంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న ఆయన.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులను ఏరకంగా ఆదుకోగలరనే సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డీఏలు, పీఆర్సీ ప్రయోజనాలు సకాలంలో అందకపోవటంతో ఉద్యోగులంతా ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఇటీవల హైదరాబాద్‌ వరద బాధితులను ఆదుకోవటానికి ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయిస్తే.. చాలామంది ఉద్యోగులు వ్యతిరేకించారు కూడా. డీఏలు లేక, పీఆర్సీ అమల్లోకిరాక తామే కష్టాల్లో ఉన్నామని, ఈ పరిస్థితుల్లో విరాళం ఇవ్వలేమని కొన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు బహిరంగ ప్రకటనలు చేశాయి కూడా. అయినా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి ఒకరోజు వేతనాన్ని విరాళంగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఉద్యోగ సంఘాల నేతలు అందజేశారు. ఆ సందర్భంగా, ఉద్యోగుల సమస్యలపై మరోసారి సమావేశమై మాట్లాడదామని ముఖ్యమంత్రి చెప్పినా.. ఇప్పటి వరకూ మళ్లీ అపాయింట్‌మెంట్‌ ఖరారు కాలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తాము ఆర్థిక ప్రయోజనాలు కోల్పోవటంతోపాటు ఇతరత్రా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు చెబుతున్నారు.


టీఆర్‌ఎస్‌ సర్కారు మొదటి టర్మ్‌లోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినా.. ఒక్క పోస్టును అదనంగా మంజూరు చేయలేదని గుర్తు చేస్తున్నారు. దీంతో, ఉన్న ఉద్యోగులపైనే అధిక పని భారం పడుతోందని, ఇది ఒత్తిడికి దారి తీస్తోందని ఆందోళన చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వటం లేదని, వారికి వేతనాలు నెలల తరబడి పెండింగులో ఉంటున్నాయని గుర్తు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు, నాలుగో తరగతి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ ఇంత వరకూ నెరవేరలేదు. పదోన్నతుల్లోనూ జాప్యం జరుగుతోంది. ఆర్టీసీ తరహాలో ఆస్పత్రిని నిర్మిస్తామని చెప్పినా.. నిర్మాణంలో ముందడుగు పడలేదు. దాదాపు 30 వేలమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలన్న డిమాండ్‌ గత కొన్నేళ్లుగా ఉంది. అది కూడా ఇప్పటి వరకూ నెరవేరలేదు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను పట్టించుకోవటం లేదని జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) కిందికి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైనా సర్వీసు మిగిలి ఉండగా చనిపోతే కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీతోపాటు ఫ్యామిలీ పెన్షన్‌ కూడా అందిస్తోంది. అనేక విజ్ఞప్తుల మీదట రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సీపీఎస్‌ ఉద్యోగులు ఎవరైనా సర్వీసు మిగిలి ఉండగా చనిపోతే 2018 నుంచి గ్రాట్యుటీ మాత్రం చెల్లిస్తున్నారు. కానీ, ఫ్యామిలీ పింఛన్‌ మాత్రం ఇవ్వడం లేదు’’ అని ఉద్యోగ సంఘం కీలక నేత ఒకరు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వివిధ కార్పొరేషన్ల ఉద్యోగులంతా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నారని, సమీప జిల్లాలకు కూడా ఇక్కడి నుంచే వెళ్లి వస్తుంటారని, వీరంతా ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారని వివరించారు.


తీసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల తీరు

ఆర్టీసీ సహా రాష్ట్రంలోని కార్పొరేషన్లు ఉనికి కోల్పోయే దశలో ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు సీఎం కేసీఆర్‌ వ్యవహార శైలిని గుర్తు చేస్తున్నారు. ‘వాళ్లంతట వాళ్లు డిస్మిస్‌ అయిపోయినట్లే’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రం పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల గురించి మాట్లాడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని కార్పొరేషన్ల పరిస్థితి ఏమిటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కీలకమైన ఆర్టీసీకి కడుపు నిండా నిధులు ఇచ్చి ఆదుకునే విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని, ఆ సంస్థలోనే ఉద్యోగ భద్రత, సకాలంలో వేతనాలు ఇస్తారనే భరోసా లేదని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగులు ఎవరైనా సర్వీసులో ఉండగా మరణిస్తే, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగాన్ని కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘రాష్ట్రంలో వివిధ వర్గాలకు చాలా కాలంగా పలు రకాల సేవలందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు (స్టేట్‌ పీఎ్‌సయూలు) క్రమంగా నిర్వీర్యమవుతున్నాయి. వాటిని పట్టాలపైకి ఎక్కించడానికి గడిచిన ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం, ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య సంస్థల ఆస్తులు, అప్పుల విభజన కొలిక్కి రాకపోవడంతో అవి ఎవరికీ పట్టని బిడ్డలా తయారయ్యాయి.


ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బడుగు బలహీన వర్గాలకు సేవలందించే కార్పొరేషన్లకూ నిధులు అందడం లేదు. పర్యవసానంగా ఆయా వర్గాలకు రుణాలు, మార్జిన్‌మనీ, సబ్సిడీలు దూరమవుతున్నాయి’’ అని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కూడా నిధులు లేక అతి కష్టమ్మీద నెట్టుకొస్తోందని, దాని వద్ద నిధులు లేకపోవటంతో చిన్న చిన్న ఎంటర్‌ప్రైజె్‌సను ఏర్పాటు చేసుకోవాలని భావించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు అందడం లేదని వివరించారు. దశాబ్దంన్నర క్రితం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఏదో ఒక కార్యక్రమంతో వార్తల్లో ఉండేవి. వీటికి చైర్మన్లు, బోర్డు డైరెక్టర్లు ఉండేవారు. ఇప్పుడా ఆ ఠీవీ, దర్పం కనిపించడం లేదు. చైర్మన్లను నియమిస్తున్నా డైరెక్టర్ల నియామకాన్ని పట్టించుకోవడం లేదు. చైర్మన్లు కూడా నిధుల కోసం ప్రభుత్వం వైపు చూడాల్సిన పరిస్థితి. వాస్తవానికి, రాష్ట్రంలో 91 ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంలో ఆయా సంస్థలను ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’లోని 9వ షెడ్యూలులో చేర్చారు. వీటికి సంబంధించిన ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరగాల్సి ఉంది. కానీ, ఏళ్లు గడుస్తున్నా ఈ సమస్య ఎటూ తెగడం లేదు. ‘ఏపీ’ పేరుతో ఉన్న సంస్థలన్నింటినీ ‘తెలంగాణ స్టేట్‌’ పేరిట తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకుంది.


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎ్‌సఆర్టీసీ), తెలంగాణ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎ్‌సఐఐసీ), తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, తెలంగాణ స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌, తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్‌, తెలంగాణ స్టేట్‌ ఫారెస్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌, తెలంగాణ హౌసింగ్‌ బోర్డు, తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, తెలంగాణ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌, తెలంగాణ స్టేట్‌ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, తెలంగాణ స్టేట్‌ బీసీ కార్పొరేషన్‌, తెలంగాణ స్టేట్‌ ఎస్సీ కార్పొరేషన్‌, తెలంగాణ స్టేట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ తదితరాలు ఏర్పాటై దాదాపు ఐదారేళ్లు కావస్తోంది. వీటిలో హౌసింగ్‌ బోర్డు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయాయి. పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వడంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ కీలక పాత్ర పోషించేది. దీని ఉద్యోగులను ఇతర సంస్థలకు బదిలీ చేయడంతో ఇప్పుడు పని లేకుండా తయారైంది. హౌసింగ్‌ బోర్డు వద్ద వందలాది ఎకరాల భూమి ఉన్నా.. అక్కడా పెద్దగా సిబ్బంది లేరు. ఎలాంటి టౌన్‌షిప్పులు, రియల్‌ ప్రాజెక్టులను చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే, సీఎం కేసీఆర్‌ ముందుగా ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలు, ఉద్యోగుల గురించి ఆలోచించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.


ముందు రాష్ట్ర ఉద్యోగుల  సమస్యలను పరిష్కరించండి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. ఎల్‌ఐసీ, రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీఎం కేసీఆర్‌ అంటున్నారు. మరి, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. సీపీఎస్‌ రద్దుకు పోరాడుతున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ చేతిలోని సమస్యే. దీనిపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు?  

దాముక కమలాకర్‌, సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల సంగతేంటి?

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని అంటున్నారు. మరి, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి కదా? వీటి సంగతేంటి? విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ ఇప్పటికీ కొలిక్కి రాలేదు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ను మూసేశారు. రాష్ట్రంలోని 91 ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 60 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  

జీటీ జీవన్‌, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సెక్రటరీ జనరల్‌


61 ఏళ్లకు వయసు పెంపు హామీ ఏమైంది?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి. పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అది నెరవేరలేదు. ఇప్పుడు కేంద్ర ఉద్యోగుల యోగక్షేమాల గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర ఉద్యోగుల సంగతిని కేంద్రం చూసుకుంటుంది. ఇక్కడి ఉద్యోగుల విషయాన్ని ఇక్కడి ప్రభుత్వం చూసుకోవాలి. 

చిలగాని సంపత్‌కుమార్‌ స్వామి, తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - 2020-11-21T09:11:02+05:30 IST