అజ్ఞాత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-03-13T11:41:02+05:30 IST

అజ్ఞాత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మావోయిస్టు గ్రూప్‌నకు చెందిన కొందరు జిల్లాలో సంచరిస్తున్నట్లు

అజ్ఞాత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి

కృష్ణకాలనీ, మార్చి 12: అజ్ఞాత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మావోయిస్టు గ్రూప్‌నకు చెందిన కొందరు జిల్లాలో సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని భూపాలపల్లి ఓఎస్డీ శోభన్‌కుమార్‌ తెలి పారు. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు అనుమానాస్పదమైన వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎవరైతే గుత్తికోయల గుంపులో ఉండేవారు, ఆ చుట్టు పక్కల గ్రామాల వారు కూడా కొత్త వ్యక్తులు వస్తే వారి సమాచారాన్ని వెంటనే పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని పేర్కొన్నారు.


మావోయిస్టులు శత్రువులుగా భావిస్తున్న వారంతా అప్రమత్తంగా ఉండాలని, వారి కదలికలను గోప్యంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు గ్రూప్‌ సభ్యులు వనం వీడి జనస్రవంతిలో కలవాలని, వారి కోసం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసి సాధించేది ఏమీ లేదని, ఆయుధాలను వీడి జనంలో కలిసి ప్రశాంత జీవనం సాగించాలని కోరారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలతోపాటు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.

Updated Date - 2020-03-13T11:41:02+05:30 IST