బిరబిరా కృష్ణమ్మ

ABN , First Publish Date - 2020-08-20T09:03:52+05:30 IST

భారీ వర్షాలకు కృష్ణమ్మ పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు వరద పోటెత్తుతోంది. దిగువన నాగార్జునసాగర్‌ కూడా వచ్చే

బిరబిరా కృష్ణమ్మ

  • శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేత
  • 3, 4 రోజుల్లో నిండనున్న నాగార్జునసాగర్‌ 
  • ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి వరద పోటు
  • కాళేశ్వరం వద్ద 9.35 మీటర్ల ఎత్తున గోదావరి
  • మేడిగడ్డ 65గేట్లు, అన్నారం 10 గేట్లు ఎత్తివేత 
  • కేంద్రం వైఖరిని ఎండగట్టాలి!
  • జలవివాదాలను పరిష్కరించడంలో విఫలం
  • ఏపీ ప్రాజెక్టులపైనా వాదనలు వినిపించాలి
  • అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాల్సిన
  • అంశాలపై అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలకు కృష్ణమ్మ పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు  వరద పోటెత్తుతోంది. దిగువన నాగార్జునసాగర్‌ కూడా వచ్చే మూడు, నాలుగు రోజుల్లో నిండే అవకాశాలున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 195 టీఎంసీల నీరు ఉంది. ఇంకా 20 టీఎంసీల మేర ఖాళీ ఉన్నప్పటికీ ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోని 3 గేట్లను పది అడుగుల మేర ఎత్తారు.


దిగువకు 1.5లక్షల క్యూసెక్కుల నీరు, సాగర్‌లోకి వెళుతోంది. బుధవారం ఆల్మట్టిలోకి 2.37 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. దిగువకు సుమారు 2.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌లోకి 2.8లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, దిగువకు 2.83 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తోంది. బుధవారం సాయంత్రం జూరాలలోకి 3.17లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు 3.16లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు.  తుంగభద్ర కూడా ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. ఈ ప్రాజెక్టులోకి 66వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం శ్రీశైలంలోకి 3.48లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది.


సాగర్‌లో ప్రస్తుతం 260టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజె క్టు పూర్తిగా నిండటానికి మరో 52 టీఎంసీల నీరు అవసరం. ఎగువ నుంచి భారీ ప్రవాహం ఉండటంతో వచ్చే మూడు నాలుగు రోజుల్లోనే సాగర్‌ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది. మరోవైపు గోదావరి ప్రాజెక్టులకు నీటి ఉధృతి పెరుగుతోంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు బుధవారం 53 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 61 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద గోదావరి 9.35 మీటర్ల ఎత్తులో ప్రవహస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 4.58 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతేనీటిని 65 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీలోకి 91వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 10గేట్లను ఎత్తి 22వేల క్యూసెక్కులను వదులుతున్నారు. భారీ వర్షాలు ప్రారంభమై, వరద నీరు రావడంతో కాళేశ్వరం పంపులను నిలిపివేశారు. వరద నీటితోనే ఎల్లంపల్లితో పాటు, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు వంటి ప్రాజెక్టులు నిండాయి. పైగా శ్రీరాంసాగర్‌లోకి కూడా వరద బాగానే వస్తుండడంతో ఇప్పట్లో కాళేశ్వరం పంపులను నడిపే అవసరం ఉండకపోవచ్చని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 47.6 అడుగులకు  తగ్గడంతో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. 


మూసీలో పడిపోయిన క్రస్ట్‌గేట్‌ బీమ్‌ 

మూసీ ప్రాజెక్టు తొమ్మిదో నంబరు క్రస్ట్‌ గేట్‌కు అనుసంధానంగా ఉన్న కౌంటర్‌ వెయిట్‌ బీమ్‌, జారి రిజర్వాయర్‌లో పడిపోయింది. సుమారు 25 టన్నుల బరువున్న బీమ్‌ గేటు ఆపరేటింగ్‌కు వీలుగా ప్రాజెక్టు గేట్‌ స్పీల్‌ వే వైపు రిజర్వాయర్‌లోకి ఉంటుంది. నీటి విడుదల  క్రమంలో బుధవారం ఉదయం రిజర్వాయర్‌లో 9వ నంబర్‌ గేట్‌కు చెందిన కౌంటర్‌ వెయిట్‌ బీమ్‌ ఇనుప రోప్‌ జాయింట్‌ నుంచి జారి రిజర్వాయర్‌లో పడిపోయింది. 


సిబ్బందికి రెయిన్‌ కోట్లు ఇవ్వండి

రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్లు, సిబ్బందిని మునిసిపల్‌ శాఖ ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే పారిశుధ్య, ప్రజారోగ్య సిబ్బందికి విధిగా రెయిన్‌ కోట్లు సరఫరా చేయాలని పేర్కొంది. సాధారణ నిధులు అందుబాటులో లేని పక్షంలో పట్టణ ప్రగతి నిధులను వినియోగించుకోవాలని శాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశించారు. 


బుధవారం నాడు వివిధ ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు(టీఎంసీల్లో)


Read more