తెలంగాణ ఆయకట్టు.. అదిరేట్టు

ABN , First Publish Date - 2020-07-19T08:05:46+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో అరుదైన చర్రిత ఆవిష్కృతం కాబోతున్నది. చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఇటు కృష్ణా, అటు గోదావరి బేసిన్‌లో సీజన్‌ మొదట్లోనే నీటి ప్రవాహాలు మొదలు కావడం...

తెలంగాణ ఆయకట్టు.. అదిరేట్టు

చరిత్రలో అత్యధిక ఆయకట్టుకు సాగునీరు

తొలిసారి ఒకే సీజన్‌లో 41 లక్షల ఎకరాలకు 

శ్రీరాంసాగర్‌ చరిత్రలో 9.68 లక్షల ఎకరాలకు

సీజన్‌ మొదట్లోనే పొలాలకు నీరు విడుదల

కృష్ణా, గోదావరి బేసిన్లలో వరద ప్రవాహాలు

ప్రాజెక్టుల్లో సంతృప్త స్థాయిలో నీటి నిల్వలు

ప్రభుత్వ నిర్ణయం.. సహకరిస్తున్న ప్రకృతి


హైదరాబాద్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో అరుదైన చర్రిత ఆవిష్కృతం కాబోతున్నది. చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఇటు కృష్ణా, అటు గోదావరి బేసిన్‌లో సీజన్‌ మొదట్లోనే నీటి ప్రవాహాలు మొదలు కావడం, కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఆయకట్టుకు సాగునీరు అందబోతున్నది. ప్రస్తుతం ఈ రెండు బేసిన్లలోని ప్రాజెక్టులు, వాటిలో ఉన్న నీటి నిల్వలు, ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాలను  అంచనా వేస్తే... ఈ విషయం అర్థమవుతున్నది. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుత వానా కాలంలో ఏకంగా 41 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎప్పుడూ ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖరీ్‌ఫలో గరిష్ఠంగా 23 లక్షల ఎకరాలకే నీటిని అందించారు. సాధారణంగా ప్రతీ ఏడాది నీటి లభ్యతను బట్టి 10-20 లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని సరఫరా చేస్తూ వచ్చారు. ఖరీఫ్‌, రబీ రెండు సీజన్‌లలో కలిపి కూడా 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇచ్చిన సందర్భం లేదు. అయితే ప్రస్తుతం ఒక్క ఖరీ్‌ఫలోనే 41 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని నిర్ణయించడం అరుదైన అంశంగా చెప్పవచ్చు. అందుకు అనుగుణంగానే వాతావరణ పరిస్థితి కనిపిస్తున్నది.


ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని సింగూరు ప్రాజెక్టు పరిధిలో మినహా.. మిగిలిన అన్ని ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ముఖ్యంగా శ్రీరాంసాగర్‌ మొదటి, రెండవ దశ మొత్తం ఆయకట్టుకు గతంలో ఎప్పుడూ నీటిని సరఫరా చేయలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలోని 9.68 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును నిర్మించిన తర్వాత ఒక్క ఖరీ్‌ఫలో పూర్తి ఆయకట్టుకు సాగునీటిని  అందించడం ఇదే తొలిసారి కానుంది. అలాగే ఇటు కృష్ణా, అటు గోదావరి బేసిన్‌లోని మెజారిటీ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీటిని అందించడం కూడా ఇదే మొదటి సారి కానుంది. పైగా  సీజన్‌ మొదట్లోనే నీటిని విడుదల చేయడం కూడా ఈ ఏడాది ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ మధ్య నిర్వహించిన రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్‌ కమిటీ (శివమ్‌) సమావేశంలో ప్రస్తుత వానా కాలంలో సాగునీటిని సరఫరా చేసే ఆయకట్టుపై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలను అంచనా వేసి, ప్రాజెక్టుల వారీగా ఆయకట్టును నిర్ణయించారు.


ఈ కమిటీ నిర్ణయం ప్రకారం ప్రస్తుత ఖరీ్‌ఫలో రాష్ట్రంలో మొత్తం 41 లక్షల ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. ఇందులో మేజర్‌ ప్రాజెక్టుల పరిధిలో 36.55 లక్షల ఎకరాలు, మీడియం ప్రాజెక్టుల పరిధిలో 3.24 లక్షల ఎకరాలు, ఐడీసీ పరిధిలో 1.3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. ఇందు కోసం సుమారు 421 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా నాగార్జునసాగర్‌ పరిధిలో 6.3 లక్షల ఎకరాలు, దేవాదుల నుంచి కూడా సుమారు 1.97 లక్షల ఎకరాలు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌, జూరాల వంటి ప్రాజెక్టుల పరిధిలో  9 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు.


కృష్ణాబేసిన్‌లో నీటి గలగలలు

కృష్ణా బేసిన్‌లోని నీటి ప్రవాహాలను అంచనా వేస్తే.. సీజన్‌ బాగున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంలో నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ఇప్పటికే జూరాల నుంచి కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులపై నిర్మించిన నె ట్టెంపాడు, బీమా వంటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్‌లను మొదలు పెట్టారు. శ్రీశైలంపై నిర్మించిన కల్వకుర్తి నుంచి కూడా త్వరలోనే నీటిని పంపింగ్‌ చేయనున్నారు. అలాగే సాగర్‌లోనూ  ఇప్పటికే ఉపయోగించుకోవడానికి 40 టీఎంసీల వరకు ఉన్నాయి. త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం కనిపిస్తోంది. జూలై మధ్యలోనే ఆల్మట్టి నుంచి మన రాష్ట్రంలోకి నీరు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ అరుదైన వాతావరణం నెలకొంది. మరో పక్క తుంగభద్రలోకి కూడా నీటి ప్రవాహం వస్తున్నది. దాంతో కృష్ణా బేసిన్‌లో దాదాపు అన్ని ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు నీరందించడానికి అవకాశం ఏర్పడింది.


గోదావరిలోనూ నీటినిల్వలు.. 

ఇటు గోదావరిలోనూ మంచి వాతావరణమే కనిపిస్తున్నది. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌లో 30 టీఎంసీలు ఉపయోగించుకోవడానికి వీలుగా నీటి నిల్వలున్నాయి. అలాగే మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులో నీటి నిల్వలున్నాయి. అటు కడెం ప్రాజెక్టులోకి కూడా నీటి ప్రవాహాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నీటితో ఖరీఫ్‌ పంటలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. అయితే భవిష్యత్తులో ఎగువ గోదావరిలో నీటి కొరత ఏర్పడితే... కాళేశ్వరం నీటితో అవసరాలను తీర్చాలని భావిస్తున్నారు. ఈ ఏడాది మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి, అక్కడ నుంచి మిడ్‌మానేరుకు కాళేశ్వరం నీటిని తరలించనున్నారు. ఇక్కడికి చేరిన నీటిలో అవసరాన్ని బట్టి ఎగువలోని శ్రీరాంసాగర్‌లోకి కూడా పంపింగ్‌ చేయనున్నారు. అలాగే దిగువలోని ఎల్‌ఎండీ అంటే శ్రీరాంసాగర్‌ రెండో దశకు కూడా నీటిని అందించడానికి అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం కొండపోచమ్మ వరకు నీటిని తీసుకువచ్చినందున చెరువులు, కుంటలను కూడా నింపే అవకాశం ఉంది. ఇలా గోదావరి బేసిన్‌లోని చాలా ఆయకట్టుకు కాళేశ్వరం నీటిని సమకూర్చే అవకాశం ఉంది. ఈ దైర్యంతోనే శ్రీరాంసాగర్‌ పరిధిలోని మొత్తం ఆయకట్టు 9.68 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. 



Updated Date - 2020-07-19T08:05:46+05:30 IST