భార్యాభర్తలు.. బ్యాంకుకు 5 కోట్ల బురిడీ

ABN , First Publish Date - 2020-11-19T08:31:02+05:30 IST

ఆ దంపతులు.. ఇళ్ల నిర్మాణాల కోసం బ్యాంకు ఖాతాదారుల పేర్లతో తప్పుడు పత్రాలను సృష్టించారు. వాటితో ఐదేళ్ల

భార్యాభర్తలు.. బ్యాంకుకు 5 కోట్ల బురిడీ

షాద్‌నగర్‌ అర్బన్‌, నవంబరు 18: ఆ దంపతులు.. ఇళ్ల నిర్మాణాల కోసం బ్యాంకు ఖాతాదారుల పేర్లతో తప్పుడు పత్రాలను సృష్టించారు. వాటితో ఐదేళ్ల క్రితం బ్యాంకు నుంచి రూ.5 కోట్ల రుణం  తీసుకున్నారు. కానీ, వాయిదాలు చెల్లించకుండా.. చిరునామాలను మారుస్తూ తప్పించుకుంటున్నారు. అయితే, ఎట్టలకేలకు పోలీసులు వారి ఆట కట్టించారు. షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ బుధవారం కేసు వివరాలను వెల్లడించారు.


హైదరాబాద్‌ షేక్‌పేట్‌లో నివసిస్తున్న భార్యాభర్తలు పబ్బతి ప్రభాకర్‌ (47), సరిత (42).. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నాగోల్‌ శ్రీకృష్ణనగర్‌ కాలనీలో సాయి ప్రాసరి డెవలపర్స్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసు నిర్వహిస్తున్నారు. షాద్‌నగర్‌ శివారు కేశంపేట రోడ్డులో గతంలో 24 ప్లాట్లు కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి రుణం కోసం 2015-16లో ఇండియన్‌ బ్యాంక్‌ షాద్‌నగర్‌ శాఖను సంప్రదించారు. బ్యాంకు ఖాతాదారుల పేర్లపై తప్పుడు సాలరీ సర్టిఫికెట్లు, ఫామ్‌-16 పత్రాలు సృష్టించి రూ.5.03 కోట్లు తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు మేనేజర్‌ మహేందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.




ప్రభాకర్‌ది ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల గ్రామం. రియల్‌ ఎస్టేట్‌లో తొలుత నష్టపోయాడు. నాగోల్‌ బండ్లగూడలో చేసిన వెంచర్‌లో లాభాలు రావడంతో ఆ పక్కనే ఉన్న దివాకర్‌సింగ్‌కు చెందిన 9 ఎకరాలను అభివృద్ధికి తీసుకున్నాడు. ఆ పత్రాలతో భూమిని తన పేరున మార్చుకున్నాడు.

చివరకు దివాకర్‌ తక్కువ ధరకు రెండెకరాలు అమ్మగా.. అపార్టుమెంట్‌ కట్టడానికి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఒప్పందం చేసుకున్నాడు. రూ. 20 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత అతడిని మోసగించాడు. ప్రభాకర్‌ రూ.ఐదు కోట్లతో విల్లా కొని విలాస జీవితం గడుపుతుండటం గమనార్హం.


Updated Date - 2020-11-19T08:31:02+05:30 IST