‘డబుల్’ ఇళ్ల కోసం ఉద్యమ కార్యాచరణ
ABN , First Publish Date - 2020-03-02T09:11:35+05:30 IST
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేసి అర్హులైన దరఖాస్తుదారులకు కేటాయించకపోతే...

ఏప్రిల్‌లోగా ఇవ్వకుంటే ప్రగతిభవన్ ముట్టడి: రేవంత్
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేసి అర్హులైన దరఖాస్తుదారులకు కేటాయించకపోతే ఉద్యమ కార్యాచరణ చేపడతామని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల దరఖాస్తుదారులతో కలిసి ప్రగతిభవన్‌తోపాటు, కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోనే 6లక్షల మంది ఇళ్లులేని పేద కుటుంబాలు ఉన్నట్లు సమగ్ర కుటుంబ సర్వే స్పష్టం చేసిందని తెలిపారు. ‘పట్నంగోస’ పేరుతో వారం రోజుల పాటు బస్తీల్లో పర్యటించిన ఆయన.. జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో ఆదివారం డబుల్ బెడ్‌రూం ఇళ్ల దరఖాస్తుదారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పేదల ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చిన రూ.9 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. తెలంగాణ వస్తే మా బతుకులను మారుస్తామని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించిన కేసీఆర్.. తమను పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు.