ఇంటి వద్ద విత్తుకొని.. మొలకశాతం చూడాలి!

ABN , First Publish Date - 2020-06-21T09:00:57+05:30 IST

పొలాల్లో నాటిన సోయబీన్‌ విత్తనాలు మొలకెత్తకపోవటం వాస్తవమేనని, ఆ విత్తనాల్లో మొలకెత్తే శాతం తగ్గిపోయిందని నిపుణులు

ఇంటి వద్ద విత్తుకొని.. మొలకశాతం చూడాలి!

బాగుంటేనే సోయా విత్తుకోవాలి.. లేదంటే సీడ్‌ వాపస్‌ 

నష్టపోయిన రైతులకు ఏజెన్సీల నుంచి పరిహారం

సోయా సాగుపై రైతులకు ప్రత్యేక సూచనలు


హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): పొలాల్లో నాటిన సోయబీన్‌ విత్తనాలు మొలకెత్తకపోవటం వాస్తవమేనని, ఆ విత్తనాల్లో మొలకెత్తే శాతం తగ్గిపోయిందని నిపుణులు అంగీకరించారు. సోయా విత్తన సాగు సమస్య పరిష్కారానికి రైతులకు సూచనలు చేశారు. నేరుగా పొలంలో విత్తకుండా తొలుత ఇంటి వద్దే రైతు కొన్ని విత్తనాలు నాటుకోవాలని సూచించారు. వారంలో ఫలితం వస్తుందని, ఎన్ని మొలకెత్తాయి? ఎన్ని లేదు? అని పరిశీలించాలని.. ఆ మేరకు సాగుపై ముందడుగు వేయాలని సూచించారు. మొలకశాతం తక్కువుందని తేలితే.. విత్తనాలను వాపస్‌ చేసి డబ్బులు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు పంపిణీ చేసిన సోయాబీన్‌ విత్తనాలు మొలకెత్తకపోవడం.. రైతుల ఆందోళనపై  ‘సోయా గయా’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.


సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ  వర్సిటీ విత్తన డైరెక్టర్‌ టి. ప్రదీప్‌, మార్క్‌ఫెడ్‌ ఎండీ భాస్కరాచారి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, వ్యవసాయశాఖ జేడీ బాలు నాయక్‌లతోపాటు పలువురు శాస్త్రవేత్తలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రైతులకు సరఫరాచేసిన సోయాబీన్‌ విత్తనాలు మొలకెత్తకపోవటం వాస్తవమేనని, విత్తనాల్లో మొలకెత్తే శాతం తగ్గిపోయిందని నిర్ధారణకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో సోయాబీన్‌ సాగుచేసే రైతులకు మూడు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. 


  విత్తన ఏజెన్సీల నుంచి రైతులకు నష్టపరిహారం 

నాణ్యతలేని సోయాబీన్‌ విత్తనాలు సరఫరాచేసిన కంపెనీలపై కఠినచర్యలు తీసుకోవాలని  ఆదేశించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. శనివారం ’ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వ్యవసాయశాఖకు ఫిర్యాదులు కూడా వచ్చాయని, అధికారుల బృందాలను రైతుల పొలాల్లోకి పంపించి నిజనిర్ధారణ చేయిస్తామని తెలిపారు.


నాణ్యతలేని విత్తనాలు సరఫరాచేసిన ఏజెన్సీల నుంచి రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారుల నుంచి పూర్తిస్థాయిలో నివేదికలు కోరినట్లు తెలిపారు. సోయా విత్తనాలు దిగుమతి చేసుకునే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా విత్తన కొరత ఉందని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా విత్తనోత్పత్తి శాతాన్ని 60 శాతానికి తగ్గించినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-06-21T09:00:57+05:30 IST