శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2020-12-28T04:57:39+05:30 IST

శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి

శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
పోలీసు శాఖ రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి

24 గంటలు ప్రజా రక్షణలో పోలీసులు
62 ప్రాపర్టీ కేసుల్లో అర కిలో బంగారం, కిలో వెండి రికవరీ
ఎస్పీ కోటిరెడ్డి

మహబూబాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని గడగడ లాడించిన కొవిడ్‌ నియంత్రణతో పాటు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించి క్రైం రేటును తగ్గించగలిగామని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. 2020 సంవత్సరమంతా కొవిడ్‌ వైరస్‌తో ఇబ్బందులున్నప్పటికి పోలీసులు వాటిని అధిగమించి 24గంటలు ప్రజా రక్షణ కోసం పాటు పడ్డారని చెప్పారు. మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం జిల్లా పోలీసు శాఖ రూపొందించిన 2020 సావనీర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో పోలీసుల పనితీరు.. కేసుల వివరాలు, అరెస్టులు, ప్రాపర్టీ రికవరీ, ఫ్రెండ్లీ పోలీస్‌ తదితర అంశాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వా రా కూలంకశంగా వివరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 252 మంది పోలీసులు కొవిడ్‌ బారిన పడినా అధైర్యపడకుండా విధులు నిర్వహించారని చెప్పారు. మహిళలకు సంబంధించి (వరకట్నం, రేప్‌, అత్యాచారాలు) గత సంవత్సరం 332 కేసులైతే ఈసారి 312 అయ్యాయని 6 శాతం తగ్గాయని చెప్పారు. ఫోక్స్‌ కేసులు గతంలో 45 ఉంటే ఈసారి రెండు పెరిగాయని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సులు నిర్వహించామని తద్వారా గతంలో 253 ఉంటే ఈ సంవత్సరం 230కి తగ్గాయని వివరించారు.
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘాపెట్టి ఉక్కుపాదం మోపడంతో పాటు నిర్వాహకులపై పీడీ యాక్టు కేసులు పెట్టామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పీడీఎస్‌ బియ్యం పట్టుకుని 75 కేసులు పెట్టామని వివరించారు. ఎక్సైజ్‌ శాఖతో కలిసి నల్లబెల్లం, గుడుంబా నియంత్రణకు పాటుపడ్డామని, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నకిలీ విత్తనాలు, ఎరువుల అమ్మకాలపై నిఘా పెట్టి చెక్‌ పెట్టామన్నారు. ఇక జిల్లాలో ఆరు సాయుధ దళాలు ఉంటే అందులో 5 దళాలను పట్టుకున్నామని, నాలుగేళ్లలో 73 మందిని అరెస్ట్‌ చేసి 28 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంకొక దళం ఉందని అందులోని సభ్యులను కూడా త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులు కూడా ప్రజల్లో భాగమేనని.. సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మానుకోట, తొర్రూరు డీఎస్పీలు ఆంగోతునరేష్‌కుమార్‌, వెంకటరమణ, ఏఆర్‌ డీఎస్పీ రేలా జనార్ధన్‌రెడ్డి, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T04:57:39+05:30 IST