కేసీఆర్‌కు కేసుల భయం పట్టుకుంది: బాపూరావు

ABN , First Publish Date - 2020-12-15T22:22:57+05:30 IST

సీఎం కేసీఆర్‌కు కేసుల భయం పట్టుకుందని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ

కేసీఆర్‌కు కేసుల భయం పట్టుకుంది: బాపూరావు

ఢిల్లీ: సీఎం కేసీఆర్‌కు కేసుల భయం పట్టుకుందని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి తర్వాత బీజేపీ పుంజుకుంటోంది. ఇది సహించలేకపోయిన సీఎం కేసీఆర్ అయోమయం సృష్టించడం కోసం ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఒకవేళ అధికారికంగా సీఎం హోదాలో కేంద్ర పెద్దలను కలిస్తే అధికారులను వెంటబెట్టుకుని వెళ్లాలి. కానీ అలా జరగలేదంటే.. ఎందుకు వెళ్లారో చెప్పాలి. అవినీతి బయటపడుతుందన్న భయంతోనే కేసీఆర్ ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. నిన్న బండి సంజయ్ ఇదే విషయం లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పకుండా.. బండి సంజయ్ మీద వేరే వాళ్ళతో ఆరోపణలు చేయిస్తున్నారు’ అని మండిపడ్డారు.


అన్నీ సొంత కుటుంబానికే దక్కాయి..

‘నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్న నినాదం సొంత కుటుంబానికే దక్కాయి తప్ప మరొకరికి రాలేదు. నిరుద్యోగులు ఈ విషయం గ్రహించి ఆగ్రహంతో ఉన్నారు. అందుకే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. రిటైర్ అయిన ఉద్యోగుల కారణంగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలి. మొత్తం 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసుకునే భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి మోసగించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అది కేంద్ర పరిధిలోకి వస్తుందని, రాష్ట్ర పరిధిలో లేవని కేసీఆర్ వితండవాదం చేస్తున్నారు. మరి పక్క రాష్ట్రం ఆంధ్రాలో సీఎం జగన్ ఎలా పట్టాలు ఇచ్చారో గ్రహించాలి. ట్రైబల్ యూనివర్సిటీని వరంగల్ జిల్లా ములుగుకు తరలించి.. ఆదిలాబాద్ ఆదివాసీలకు అన్యాయం చేశారు’ అని సోయం బాపూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-15T22:22:57+05:30 IST