నైరుతి నిష్క్రమణం

ABN , First Publish Date - 2020-10-27T09:42:07+05:30 IST

ఈ ఏడాది జూన్‌ 11న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన వాటి నిష్క్రమణ..

నైరుతి నిష్క్రమణం

ఈశాన్య రుతు పవనాల ప్రవేశం


హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జూన్‌ 11న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన వాటి నిష్క్రమణ.. మంగళవారంతో పూర్తయ్యే అవకాశాలున్నాయి. బుధవారం నాటికి (28 తేదీ) దేశవ్యాప్తంగా నైరుతి నిష్క్రమణ పూర్తవుతుందని, ఆ వెంటనే ఈశాన్య రుతు పవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో వానాకాలం (జూన్‌-సెప్టెంబరు) సగటు వర్షపాతం 79.14 సెంటీమీటర్లు కాగా ఈసారి 107.83 సెంటీమీటర్ల మేర నమోదైంది. సీజన్‌ ముగిశాక కూడా అక్టోబరు 1 నుంచి 26 వరకూ 8.39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 16.84 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదైంది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వచ్చిన వానలు, వరదలు ఒకెత్తు అయితే... అక్టోబరులో వచ్చిన వరదలు మరొక ఎత్తు. హైదరాబాద్‌లో అక్టోబరులో సాధారణ వర్షపాతం 8.52 సెంటీమీటర్లు కాగా.. ఈసారి ఏకంగా 38.3 సెం.మీ వర్షపాతం నమోదు కావడం ఇందుకు నిదర్శనం. ఇలా సాధారణం కన్నా 349 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం హైదరాబాద్‌ చరిత్రలోనే ఒక రికార్డు.

Updated Date - 2020-10-27T09:42:07+05:30 IST