పొల్యూషన్‌కు సొల్యూషన్‌.. వాహన కాలుష్యానికి అడ్డుకట్ట

ABN , First Publish Date - 2020-12-10T19:53:09+05:30 IST

కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. అనేక రుగ్మతలకు కారణమవుతోంది. వాహనాల నుంచి వచ్చే పొగ రోగాలకు దారి తీస్తోంది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. కొత్త నిబంధనలను అమల్లోకి తేనుంది. పొల్యుషన్‌ అండర్‌ కంట్రోల్‌ (పీయూసీ) సర్టిఫికేట్‌ లేకుండా వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకోనుంది. పీయూసీని నిర్దేశించిన గడువులోగా తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.

పొల్యూషన్‌కు సొల్యూషన్‌.. వాహన కాలుష్యానికి అడ్డుకట్ట

అమల్లోకి రానున్న కఠిన నిబంధనలు 

పీయూసీ సర్టిఫికేట్‌ లేకుంటే ఆర్‌సీ జప్తే..


కృష్ణకాలనీ/వరంగల్(ఆంధ్రజ్యోతి): కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. అనేక రుగ్మతలకు కారణమవుతోంది. వాహనాల నుంచి వచ్చే పొగ రోగాలకు దారి తీస్తోంది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. కొత్త నిబంధనలను అమల్లోకి తేనుంది. పొల్యుషన్‌ అండర్‌ కంట్రోల్‌ (పీయూసీ) సర్టిఫికేట్‌ లేకుండా వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకోనుంది. పీయూసీని నిర్దేశించిన గడువులోగా తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.  చెల్లుబాటులో లేని పీయూసీ ఉంటే గనుక వారం రోజుల గడువు ఇస్తారు. ఆ తర్వాత కూడా సర్టిఫికేట్‌ తీసుకోని పక్షంలో వాహనానికి సంబంధించిన ఆర్‌సీని ఆర్టీవో అధికారులు స్వాధీనం చేసుకుంటారు. 


పీయూసీలో పలు మార్పులు..

పీయూసీ సర్టిఫికేట్‌లో మరికొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. గతంలో ఒక్కో వాహనానికి సంబంధించి ఒక్కో రకమైన సర్టిఫికేట్‌ ఉండేది. కొత్త నిబంధనల్లో భాగంగా అన్ని రకాల వాహనాలకూ ఒకే రకమైన పీయూసీ సర్టిఫికేట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇది వరకులా ఉదాసీనతకు తావివ్వకుండా పీయూసీ సర్టిఫికెటట్‌ లేని వాహనదారులపై చర్యలు తీసుకోనున్నారు. ఈ ధ్రువీకరణ పత్రం లేకుంటే ఆర్‌సీ బుక్కును స్వాధీనం చేసుకోనునానరు. 


నూతన సంవత్సరం నుంచి శ్రీకారం..

వాహన కాలుష్య నివారణ నిబంధనలు నూతన సంవత్సరం నుంచి అమలు కానున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీవో కార్యాలయ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఓ సైట్‌ రూపొందించనుంది.  విధివిధానాలపై ఇప్పటికే సంబంధిత కార్యాలయానికి ఆదేశాలు జారీ అయ్యాయి.


రోడ్డలన్నీ రద్దీ..

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వాహనాల సంఖ్య జనాభాకు మించి పోతోంది. నాలుగు చక్రాల వాహనాలు సుమారు మూడు వేలు, ద్విచక్రవాహనాలు సుమారు ఆరు వేలు, సుమారు ఎనిమిది వందల ఆటోలు నడుస్తున్నాయి. భూపాలపల్లి ఆర్టీసీ డిపో పరిధిలో 87 బస్సులు ఉన్నాయి. వీటితో పాటు నిత్యం జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించే కార్లు, బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు రెట్టింపు సంఖ్యలో ఉంటాయని అధికారుల అంచనా. రోజుకు వేలాది వాహనాలు తిరుగుతుండటంతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. వీటిలో సగానికి పైగా వాహనాలకు పొల్యుషన్‌ సర్టిఫికేట్‌ తీసుకోవడం అరుదనే చెప్పొచ్చు. కొత్తగా అమల్లోకి వచ్చే నిబంధనలతో ఈ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా కానుంది.  


ఆదేశాలు రాగానే అమలు : వేణు, రవాణా శాఖ జిల్లా అధికారి

వాహన పొల్యూషన్‌ నిబంధనలపై కేంద్రం నుంచి పూర్తి స్థాయి ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. ఇప్పటికే కొత్త గైడ్‌లెన్స్‌పై కొంత సమాచారం ఉంది. నూతన సంవత్సరం నుంచి పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ అన్ని రకాల వాహనాలకు తప్పనిసరి కానుంది. పూర్తి స్థాయి ఆదేశాలు రాగానే జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి నూతన విధానాన్ని అమలు చేస్తాం.

Updated Date - 2020-12-10T19:53:09+05:30 IST