హస్తినలో రైతు పోరుకు సంఘీభావాలు
ABN , First Publish Date - 2020-12-06T08:30:33+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న మహా ఆందోళనకు సంఘీభావంగా శనివారం రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు జరిగాయి.

హైదరాబాద్/కవాడిగూడ/వడ్డెపల్లి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న మహా ఆందోళనకు సంఘీభావంగా శనివారం రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలను నిరసిస్తూ డిసెంబరు 8న తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని 10 వామపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ ప్రదర్శన, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
ఇందులో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కన్వీనర్ విమలక్క, తెలంగాణ ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతు ఉద్యమానికి సంఘీభావంగా ఏఐటీయూసీ, సీపీఐల ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద న్యాయవాదులు ధర్నా చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులను కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మార్చేలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.