పంచాయతీల్లో సోలార్ ప్లాంట్లు
ABN , First Publish Date - 2020-08-20T09:22:50+05:30 IST
విద్యుత్తు బిల్లుల భారం తగ్గించడానికి జాతీయ రూర్బన్ మిషన్ కింద గ్రామ పంచాయతీల్లో సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ

- 810 కిలోవాట్ల సామర్థ్యం గలవి ఏర్పాటు
- 25 ఏళ్లపాటు పంచాయతీలకు తగ్గనున్న విద్యుత్తు బిల్లుల భారం
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు బిల్లుల భారం తగ్గించడానికి జాతీయ రూర్బన్ మిషన్ కింద గ్రామ పంచాయతీల్లో సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. వీధి దీపాల విద్యుత్తు బిల్లుల చెల్లింపు పంచాయతీలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల 810 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను పెట్టనున్నారు. వీటితో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడమే కాక పంచాయతీలకు బిల్లుల భారం తప్పుతుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సంస్థల ఎంపిక బాధ్యత తెలంగాణ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సరెడ్‌కో)కు అప్పగించారు. పంచాయతీల ఆదాయం అంతంతమాత్రంగా ఉండగా, ఏటా బిల్లుల బకాయిల భారం పెరిగిపోతోంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు వాటిని తీర్చడానికే సరిపోతున్నాయి. దాంతో 7 జిల్లాల్లోని ఏడు క్లస్టర్‌లలో ఈ ప్లాంట్లు పెట్టి, నెట్‌మీటరింగ్ సదుపాయం కల్పించనున్నారు. పగటిపూట ఉత్పత్తి అయ్యే విద్యుత్తును డిస్కమ్‌లకు ఇచ్చి, రాత్రిపూట డిస్కమ్‌ల నుంచి విద్యుత్తు తీసుకొని వీధిదీపాలకు వినియోగిస్తారు.
ఆ తర్వాత ఉత్పత్తి అయిన విద్యుత్తు, వాడిన విద్యుత్తుపై నెట్‌మీటరింగ్ ద్వారా లెక్కలు తీసి వాడిన విద్యుత్తు ఎక్కువ ఉంటే ఆ మేరకు పంచాయతీలు బిల్లులు చెల్లిస్తాయి. ఈ ప్లాంట్ల వల్ల పంచాయతీలకు 70 శాతం మేర బిల్లుల భారం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. జూపార్కులో 100 కిలోవాట్లు, తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 100 కిలోవాట్లు, వికారాబాద్ జిల్లా అల్లాపూర్.ఎస్ క్లస్టర్‌లో 66, కరీంనగర్‌లోని బిజిగిరిషరీ్‌ఫ(జమ్మికుంట) క్లస్టర్‌లో 15, సిద్దిపేట జిల్లాలోని జాలిగావ్‌లో 65, నల్లగొండ జిల్లా కేబీపల్లి క్లస్టర్‌లో 14, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం క్లస్టర్‌లో 70, రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి క్లస్టర్‌లో 74, పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ క్లస్టర్‌లో 175 కిలోవాట్ల ప్లాంట్లు పెట్టనున్నారు. టెండర్‌లలో ఎల్1(అతి తక్కువగా కోట్ చేసే సంస్థ)కు 40 శాతం పనులు, ఆ తర్వాత స్థానాల్లో ఉన్నవారికి 15 శాతం చొప్పున కేటాయిస్తారు. ఐదేళ్ల పాటు నిర్వహణ కాంట్రాక్టరే చూడాల్సి ఉంటుంది. ఒక్కసారి ప్లాంటు పెడితే దాదాపు 25 ఏళ్లపాటు పంచాయతీలకు విద్యుత్తు బిల్లుల భారం తగ్గుతుంది.