ఆర్థిక ఇబ్బందులతో యువకుల పెడదోవ
ABN , First Publish Date - 2020-10-04T07:29:32+05:30 IST
ఒకరివి ఆర్థిక ఇబ్బందులు. మరొకరు వ్యసనం కారణంగా అప్పులపాలు. తమ కష్టాలు తీరేందుకు..
గొలుసు దొంగలుగా మారిన ఇద్దరు
అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 3 (ఆంధ్రజ్యోతి): ఒకరివి ఆర్థిక ఇబ్బందులు. మరొకరు వ్యసనం కారణంగా అప్పులపాలు. తమ కష్టాలు తీరేందుకు ఆ ఇద్దరు యువకులు తప్పుడు మార్గం ఎంచుకున్నారు. ఫలితంగా కటకటాలపాలయ్యారు. జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన సొక్కం రవికుమార్ నగరంలోని దమ్మాయిగూడలో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా క్యాబ్‌కు బేరాలు సరిగ్గా లేకపోవడంతో ఆర్థికంగా చిక్కుల్లో పడ్డాడు. వాటి నుంచి గట్టెక్కేందుకు గాను గొలుసు దొంగగా మారాలని నిర్ణయించుకున్నాడు. మల్కాజిగిరి చాణక్యపురి కాలనీలో ఓ మహిళ మెడలో మంగళసూత్రాన్ని దొంగిలించి స్కూటీపై పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఆధారంగా స్కూటీని గుర్తించి నిందితుడిని అరెస్టు చేశారు. అతడి వద్ద బాధిత మహిళకు చెందిన మంగళసూత్రాన్ని స్వాధీనపరచుకున్నారు.
ఐపీఎల్ బెట్టింగులతో అప్పుల పాలై...
యాప్రాల్‌కు చెందిన గుమ్మడెల్లి రవికుమార్ 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం ఓ ప్రైవేట్ సంస్థలో మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగంలో చేరాడు. కరోనా కారణంగా కొలువు పోవడంతో.. స్నేహితులతో కలిసి ఐపీఎల్ క్రికెట్ పందేలు ఆడి మరింత అప్పులపాలయ్యాడు. అవి తీర్చడానికి డబ్బులు లేకపోవడంతో గొలుసు దొంగ అవతారం ఎత్తాడు. నేరేడ్‌మెట్ పరిధిలోని డిఫెన్స్‌కాలనీలో ఒంటరిగా వెళ్తున్న మహిళను వెంబడించి, ఆమె మెడలోని 4.5తులాల పుస్తెల తాడును గుంజుకుని పరారయ్యాడు. బాధిత మహిళ కేకలు విన్న శ్రీనివా్‌సరెడ్డి, మీర్జాఫిరోజ్ జవహర్, కుందూరి మాలకొండారెడ్డి అనే ముగ్గురు పౌరులు రవికుమార్‌ను పట్టుకోగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగను పట్టుకున్న పౌరులను సీపీ మహేష్ భగవత్ అభినందించి రివార్డులు అందజేశారు.