24 దళిత కుటుంబాల సాంఘిక బహిష్కరణ
ABN , First Publish Date - 2020-12-28T08:42:31+05:30 IST
గ్రామంలో రెండు నెలల క్రితం దసరా రోజున ఓ వేడుకను అడ్డుకున్నారనే నెపంతో ఊర్లోని 24 దళిత కుటుంబాలపై సాంఘిక బహిష్కరణ విధించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఎస్సారెస్పీ పునరావాస గ్రామమైన

ధిక్కరిస్తే రూ.10వేల జరిమానా అని తీర్మానం
దసరాకు మహిషాసుర వధ కార్యక్రమాన్ని అడ్డుకున్నారనే..
2నెలలుగా ఆ కాలనీ వాసుల ఇబ్బందులు..
జగిత్యాల జిల్లా సంగెం శ్రీరాంపూర్‌లో వెలుగులోకి
జగిత్యాల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామంలో రెండు నెలల క్రితం దసరా రోజున ఓ వేడుకను అడ్డుకున్నారనే నెపంతో ఊర్లోని 24 దళిత కుటుంబాలపై సాంఘిక బహిష్కరణ విధించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఎస్సారెస్పీ పునరావాస గ్రామమైన సంగెం శ్రీరాంపూర్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఏటా దసరారోజు అక్కడి ప్రధాన చౌరస్తాలో ఊరంతా కలిసి మహిషాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గత అక్టోబరు 25న దసరా రోజు ఎప్పటిలాగే నిర్వహించ తలపెట్టారు. ఆ సమీపంలోనే అంబేడ్కర్ విగ్రహం ఉన్నందున, వేరే చోట నిర్వహించాలని గ్రామంలోని కొందరు దళిత యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొంత వాగ్వాదం జరిగింది. పోలీసులొచ్చి ఇరువర్గాలను సముదాయించి వేడుకను పూర్తి చేయించారు.
ఈ వ్యవహారంపై మరుసటి రోజు గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యులు సమావేశమయ్యారు. తమను ధిక్కరించి మహిషాసుర వధ కార్యక్రమానికి అడ్డు వచ్చారని 24 దళిత కుటుంబాలపై సాంఘిక బహిష్కరణ విధించారు. వీడీసీ ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే రూ.10 వేల జరిమానా విధించాలని తీర్మానం చేశారు. అప్పటి నుంచి రెండు నెలలుగా దళిత కుటుంబాలు నివాసం ఉంటున్న కాలనీకి పాలు, ఇతర నిత్యావసర వస్తువుల అమ్మకందారులు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఈ నెల 20న పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు వీడీసీ సభ్యులు 18 మందిపై మల్లాపూర్ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. వారిని అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమ సమస్య పరిష్కరించాలని, సాంఘిక బహిష్కరణ నుంచి తమకు విముక్తి కల్పించాలని బాధితులు కోరుతున్నారు.