సామాజిక దూరం తప్పనిసరి

ABN , First Publish Date - 2020-03-21T09:26:20+05:30 IST

: కరోనా వైరస్‌ కట్టడికి ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులను కోరారు. మహమ్మారి నియంత్రణకు ఇది చాలా ముఖ్యమని చెప్పారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ను నిరోధించాలని,

సామాజిక దూరం తప్పనిసరి

కరోనా కట్టడికి నిరంతర నిఘా ముఖ్యం

సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని 

హైదరాబాద్‌ సీసీఎంబీని ఉపయోగించండి

మోదీని కోరిన సీఎం కేసీఆర్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ కట్టడికి ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులను కోరారు. మహమ్మారి నియంత్రణకు ఇది చాలా ముఖ్యమని చెప్పారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ను నిరోధించాలని, ధరలకు రెక్కలు రాకుండా చూడాలని, దీనికి వర్తక సంఘాలతో సీఎంలు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సూచించారు. గురువారం వివిధ రాష్ట్రాల సీఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నియంత్రణ చర్యలపై చర్చించారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, ప్రజలు, స్థానిక అధికారుల భాగస్వామ్యం, నిరంతర నిఘా చాలా అవసరమని ప్రధాని చెప్పారు.


వైరస్‌ పరీక్షా కేంద్రాలను పెంచాలని, బలహీన వర్గాలకు మరింత సహాయం అందించాలని, రాష్ట్రాలకు 2020-21 నిధులను ముందుగా ఇవ్వాలని, ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల సేవలను ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని సీఎంలు వివరించారు. తమ రాష్ట్రాల్లో చేపట్టిన చర్యలను తెలిపారు. దీనికి ప్రధాని ప్రశంసిస్తూ... రాష్ట్రాల్లో అనుభవాలను పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రంగా హైదరాబాద్‌లోని సీసీఎంబీని ఉపయోగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరారు. సీసీఎంబీలో ఒకేసారి 1,000 నమూనాలను పరీక్షించే అవకాశం ఉందని తెలిపారు. కేంద్రానికి సంపూర్ణ సహకారం అందిస్తూ, సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు.


వైరస్‌ నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చినవారి ద్వారానే వైరస్‌ ప్రబలుతున్నందున కొద్ది రోజులు విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని కోరారు. రైల్వే స్టేషన్ల వద్ద ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రైల్వే స్టేషన్లు, బోగీల్లో హై-శానిటైజేషన్‌ నిర్వహించాలని కోరారు. తెలంగాణలో శ్రీరామనవమి, జగ్నే కీ రాత్‌ ఉత్సవాలు రద్దు చేశామని వివరించారు. కాగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి శుక్రవారం వైద్యులైన 38 మంది ఎంపీలను కలిశారు.


జనతాకర్ఫ్యూ పాటించండి: సీఎం కేసీఆర్‌

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ఆదివారం దేశవ్యాప్తంగా చేపట్టబోతున్న జనతా కర్ఫ్యూను తెలంగాణలో విధిగా పాటించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూని విజయవంతం చేయడానికి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సీఎస్‌ సోమేశ్‌ను సీఎం ఆదేశించారు. కాగా, జనతా కర్ఫ్యూ పిలుపునకు లభిస్తున్న మద్దతుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు పలువురు నేతలు చేసిన ట్వీట్లపై మోదీ స్పందించారు.


కేసీఆర్‌ కరీంనగర్‌ పర్యటన వాయిదా

కరీంనగర్‌లో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన వాయిదా పడింది. కరీంనగర్‌కు పది మంది ఇండొనేషియా వాసులు రావటం, వారికి కరోనా లక్షణాలున్నట్లు నిర్ధారణ కావటంతో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రజల్లో భరోసా నింపేందుకు సీఎం కేసీఆర్‌ శనివారం కరీంనగర్‌ వెళ్లాలని తొలుత నిర్ణయించుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం అక్కడికి వెళ్లటం శ్రేయస్కరం కాదని అధికారులు సూచించారు. వైద్యసేవలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితుల్లో అక్కడ పర్యటిస్తే అసౌకర్యం కలుగుతుందన్న యంత్రాంగం సూచన మేరకు సీఎం కేసీఆర్‌ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. కాగా శుక్రవారం కరీంనగర్‌లో జరుగుతున్న వైద్యసేవలు, స్ర్కీనింగ్‌పై జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్లతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. వారు కూడా ఏర్పాట్లపై భరోసా ఇచ్చారు.

Updated Date - 2020-03-21T09:26:20+05:30 IST