పనులు స్లో..!

ABN , First Publish Date - 2020-03-19T10:55:45+05:30 IST

పట్టణంలో సమస్యలు తాండవిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. జనగామ జిల్లాగా ఏర్పడి

పనులు స్లో..!

పట్టణంలో రూ.30     కోట్లతో నిర్మాణాలు

నత్తనడకన సాగుతున్న  అభివృద్ధి పనులు

పలు వార్డుల్లో ఇప్పటికీ సగం కూడా పూర్తికాని పరిస్థితి

జనగామ చౌరస్తాల్లో గుంతల రోడ్లు

డ్రెయినేజీలు అధ్వానం.. కానరాని స్వచ్ఛత

కొన్నిచోట్ల ఎక్కడి కంకర కుప్పలు అక్కడే

ఖాళీ ప్లాట్లలో ఏపుగా పిచ్చిమొక్కలు

సుందరీకరణకు నిధుల కరువు

10 రోజులకే పరిమితమైన పట్టణ ప్రగతి


 ఆంధ్రజ్యోతి, జనగామ

పట్టణంలో సమస్యలు తాండవిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. జనగామ జిల్లాగా ఏర్పడి నాలు గేళ్లైనా ప్రగతి రథం పరుగుపెట్టడం లేదు. కొన్ని  నిర్మాణాలు జాముగా సాగుతుండగా.. మరికొన్ని నిధుల్లేక సగంలోనే నిలిచిపోతున్నాయి. 


పట్టణ అభివృద్ధికి రూ.30కోట్ల నిధులు..

జనగామ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందు కు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. జిల్లా కేంద్రంలో సుమారు లక్ష జనాభా ఉండగా.. 30 వార్డులున్నాయి. సర్కారు మంజూరు చేసిన రూ.30 కోట్ల నిధులతో సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్ల నిర్మాణం తోపాటు వాటి మధ్యలో మొక్కలు నాటడం తదితర పనులు చేపట్టారు. చౌరస్తా నుంచి నెహ్రూపార్కు వరకు పాత డివైడర్లు తొలగించి కొత్తడివైడర్లను నిర్మించే, పనులను ప్రారంభించి.. ఆరునెలలు అవుతున్నా నేటికీ పూర్తి కాలేదు. జనగామ చౌరస్తా నుంచి సిద్దిపేట రోడ్డు, సూర్యాపేట రోడ్డు, హైదరాబాద్‌రోడ్డు, హన్మకొండరోడ్డులో రహదారులు గుంతల మయంగా మారింది. కాగా, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ సుందరీకరణ పనులను పూర్తి చే యకపోగా మిగిలిన పనులు చేపట్టేందుకు నిధులు లేకపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. 


గత కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి హయాంలో..

డివిజన్‌ కేంద్రంగా ఉన్న జనగామ జిల్లా కేంద్రం గా మారిన తరువాత గత కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి హయాంలో పట్టణ సుందరీకరణకు రూ.30 కోట్ల ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వీటితో ఆర్‌టీసీ చౌరస్తా నుంచి నెహ్రూపార్కు వరకు రహదారులకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించారు. పాత డివైడర్లను తొలగించి కొత్తగా డివైడర్లు వేసి ఇందులో సెంట్రల్‌ లైటింగ్‌తో పాటు హరితహారంలో భాగంగా మొక్క లు నాటవలసి ఉన్నప్పటికీ ఇంతవరకు మొక్కలు నాటేపని మొదలు కాలేదు. మరోవైపు చౌరస్తా నుం చి హన్మకొండ రోడ్డులో ప్రారంభించిన డివైడర్ల నిర్మాణం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సూర్యాపేట, హైదరాబాద్‌ రోడ్లవైపు డివైడర్ల నిర్మా ణం అర్ధాంతరంగా ఆగిపోయింది.  


ఎన్నికల ముందు హడావిడి..

మునిసిపల్‌ ఎన్నికలకు ముందు హడావిడిగా సుందరీకరణ పనులను చేపట్టి ప్రస్తుతం కొత్త పాలకవర్గం కొలువుదీరిన తరువాత పనులపై దృష్టి సారించడంలేదనే ప్రజలు విమర్శిస్తున్నారు.


పట్టణ ప్రగతి పది రోజులేనా..?

ప్రభుత్వం ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమం పదిరోజుల పాటు సాగగా ఆ తరువాత షరా మామూలుగా మారింది. మురుగునీటి కాలువల్లో సీల్ట్‌ తొలగింపు పనులు గతవారం రోజులుగా ముందుకు సాగడంలేదు. మునిసిపాలిటీ పరిధిలో 3వ వార్డు శ్రీహర్ష కాలనీలో రోడ్లపై ఉన్న మట్టికుప్పలను పట్టణ ప్రగతి కార్యక్రమంలో తొలగించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా వేసిన సీసీరోడ్డుకు సైడ్‌బర్మ్‌లు పూర్తి చేయలేదు. రోడ్డుకు ఇరువైపులా ఒక్క మొక్కకూడా నాటిన దాఖలాలు లేవు. హైదరాబాద్‌ రోడ్డులోని 4వార్డు ఇందిరమ్మకాలనీలో అనేక ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగినా తొలగించేపని చేపట్టలేదు. 20వ వార్డులో ఎమ్మాఆర్‌సీబీ హోటల్‌వద్ద మురుగునీటి కాలువలు నిండుకుని రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. ఆప్రాంతమంతా అశుభ్రంగా ఉన్నా పట్టించుకోలేదు.


3వార్డులోని గ్లోరీ ఫంక్షన్‌హాల్‌ వెనుకవైపున మురుగునీటి కాలువల నిర్మాణం జరగలేదు. తాత్కాలిక కాలువను కనీసం నీళ్లుపోయేలా కూడా చేయలేదు. 27వార్డులోని రెడ్డిస్ట్రీట్‌లో పట్టణ ప్రగతి జరిగిన పదిరోజుల్లో డ్రైనేజీకాలువలో సీల్ట్‌ తొలగించలేదు. స్కాలర్స్‌ స్కూల్‌వద్ద రోడ్లపైనున్న కంకర కుప్పలు సరిగా తొలగించలేదు. ఇదేవార్డులోని చెంచారపు బుచ్చిరెడ్డి నివాసం ముందు మురుగునీటి వ్యవస్థ ప్రమాదకరంగా ఉన్నా చర్యలు చేపట్టలేదు. మునిసిపల్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలోని పలు వార్డులలో పలుకుబడి ఉన్న స్థానికులు ఇష్టారాజ్యంగా రోడ్డుపై స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సదరు నాయకుల ఇళ్లముందు పెద్దపెద్ద స్పీడ్‌బ్రేకర్లు అనుమతి లేకుండానే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనాలు, కార్లు దెబ్బతింటున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. 


రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి.. పొత్కనూరి ఉపేందర్‌, జనగామ పట్టణం

నాలుగురాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న జనగామ పట్టణంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. మొకాళ్లులోతు గుంతలతో ప్రయాణం నరకంగా మారుతోంది. ముఖ్యంగా హన్మకొండ రోడ్డు, సిద్దిపేట రోడ్డులో రోడ్లపరిస్థితి ఘోరంగా మారింది. నిత్యం అధికారులు ఆ రహదారుల గుండా వెళ్తున్నప్పటికీ మరమ్మతులపై దృష్టిపెట్టడం లేదు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి డివైడర్లు పూర్తి చేయాలి. 

Updated Date - 2020-03-19T10:55:45+05:30 IST