ఏ రోజు స్లాట్‌లు ఆ రోజే రిజిస్ట్రేషన్‌ కావాలి

ABN , First Publish Date - 2020-11-06T07:43:01+05:30 IST

‘‘ఏ రోజు స్లాట్‌ బుక్‌ చేసుకుంటే ఆ రోజే రిజిస్ట్రేషన్‌ జరగాలి. కాదు కూడదని రైతులు/భూ యజమానులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు’’

ఏ రోజు స్లాట్‌లు ఆ రోజే రిజిస్ట్రేషన్‌ కావాలి

నిర్లక్ష్యం చేస్తే కొలువులూడతాయ్‌

తహసీల్దార్లకు హెచ్చరిక.. కలెక్టర్లకు సీఎస్‌ క్లాస్‌

మండల కార్యాలయాల్లో స్లాట్‌లు బుక్‌ చేయొద్దు

రిజిస్ట్రేషన్లపై సోమేశ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ధరణి రిజిస్ట్రేషన్లతో రూ.7.77 కోట్ల ఆదాయం


హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏ రోజు స్లాట్‌ బుక్‌ చేసుకుంటే ఆ రోజే రిజిస్ట్రేషన్‌ జరగాలి. కాదు కూడదని రైతులు/భూ యజమానులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ హెచ్చరించారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ అకారణంగా రిజిస్ట్రేషన్లు ఆలస్యం చేస్తే కొలువులు ఊడతాయని స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్లతో ధరణి రిజిస్ట్రేషన్లపై సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చాలా మండలాల్లో ధరణి ఆపరేటర్లు స్లాట్‌లు బుక్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. స్లాట్‌లు బుక్‌ చేసుకోవడానికి మీ సేవ కేంద్రాల్లో అవకాశం ఇచ్చామని తెలిపారు. మండల కార్యాలయాల్లో స్లాట్‌లు బుక్‌ అయితే ఊరుకునేది లేదన్నారు. తహసీల్దార్లు తమ లాగిన్‌ వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని చెప్పారు. ధరణి వెబ్‌సైట్‌లో ఏ రికార్డులు ఉంటే.. వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరగాలని, వివాదాలు ఏమైనా ఉంటే రైతులే న్యాయస్థానాల్లో చూసుకుంటారని పేర్కొన్నారు. ధరణి రిజిస్ట్రేషన్లు/మ్యుటేషన్లలో తహసీల్దార్లకు ఎలాంటి విచక్షణ అధికారాలు లేవని, రికార్డుల్లో ఉన్న వివరాలతో పని చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా పలువురు కలెక్టర్లకు ఆయన క్లాస్‌ తీసుకున్నారు. అంతకు ముందు ధరణి టెక్నికల్‌ కంట్రోల్‌ రూమ్‌ను సీఎస్‌ పరిశీలించారు. 100 మంది సభ్యులతో కూడిన కంట్రోల్‌ రూమ్‌ పనితీరు, వారికి క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమస్యలు.. అనుమానాలేంటి..? అని ఆరా తీశారు. క్షేత్రస్థాయిలోని ధరణి ఆపరేటర్లతో చర్చిస్తూ ఏమైనా సమస్యలున్నాయా..? అని ఆరా తీసి.. వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.

ఈనెల 2న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ కోసం ధరణి పోర్టల్‌ ప్రారంభించగా.. గురువారం నాటికి 2,622 రిజిస్ట్రేషన్లు జరిగాయని సీఎస్‌ వెల్లడించారు. దీనివల్ల రూ.7.77 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్‌ పనితీరు మెరుగుపడిందని, సంతృప్తికరంగా ఉందని చెప్పారు.


Updated Date - 2020-11-06T07:43:01+05:30 IST