తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల స్లాట్ బుకింగ్ నిలిపివేత
ABN , First Publish Date - 2020-12-19T20:57:54+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల స్లాట్ బుకింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల స్లాట్ బుకింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి యధావిథిగా రిజిస్టేషన్‌లు చేసుకోవచ్చిన ఉత్తర్వుల్లో తెలిపింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్లాట్ బుకింగ్‌లు నిలిపివేసున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 21న రిజిస్ట్రేషన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా 14వ తేదీ(సోమవారం) నుంచి ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన పాత పద్ధతి ‘కార్డు’(కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) ద్వారా ఆస్తుల నమోదు ప్రారంభించాలంటూ హైకోర్టు ఆదేశించిన దరిమిలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ధరణి విషయంలో సర్కార్ తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తోందని మండిపడింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్, కులం, వ్యక్తిగత వివరాలను నమోదు చేయబోమన్న హామీని ఎందుకు ఉల్లంఘించారో తెలపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.