హ్యాండ్ శానిటైజర్లతో చర్మ సమస్యలు
ABN , First Publish Date - 2020-04-21T08:19:37+05:30 IST
హ్యాండ్ శానిటైజర్లను అత్యవసర పరిస్థితుల్లో పరిమితంగా వాడాలని, ఎక్కువగా వాడితే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) డైరెక్టర్ డాక్టర్ శంకర్ తెలిపారు.

చేతులను సబ్బు, నీటితోనే శుభ్రపరచుకోండి
కరోనా, లాక్‌డౌన్‌తో పలువురిలో ఆందోళన
భయం వద్దు.. కరోనా మరణాలు 2-3 శాతమే
మానసిక సమస్యలుంటే 108కి ఫోన్ చేయండి
ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ సూచనలు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): హ్యాండ్ శానిటైజర్లను అత్యవసర పరిస్థితుల్లో పరిమితంగా వాడాలని, ఎక్కువగా వాడితే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) డైరెక్టర్ డాక్టర్ శంకర్ తెలిపారు. పరిశుభ్రమైన నీరు, సబ్బుతోనే చేతులు శుభ్రపరచుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. సోమవారం కింగ్ కోఠి ఆస్పత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ నివేదితతో కలిసి మాసబ్‌ట్యాంక్ సమాచార భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌తో మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి 108 హెల్ప్ లైన్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తున్నామని తెలిపారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో కొంత మంది ప్రజలు బందీలుగా భావిస్తున్నారని, ఇలాంటి వారు కొంత మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. భవిష్యత్తుపై బెంగ, వైరస్ బారిన పడితే ఏమైపోతామనే భయం, ఇతర సమస్యల వంటివి ఇందుకు కారణమని చెప్పారు.ఇటువంటి వారి కోసం ప్రభుత్వం 108 హెల్ప్ లైన్ ద్వారా ఆన్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసిందని, ఈ సెంటర్లు 24 గంటలు పని చేస్తాయని తెలిపారు. ఎవరికైనా మానసిక సమస్యలు, ఆందోళనలు ఉంటే 108 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సంప్రదించవచ్చన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరణాల శాతం 2 నుంచి 3 శాతం మాత్రమే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎక్కువ నిమ్మకాయ, నారింజ వంటి సి-విటమిన్ పండ్లను తీసుకోవాలని, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని అన్నారు.
మానసిక ఆరోగ్యం కీలకం..
తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని 15 నుంచి 80 ఏళ్ల వయసు వారి నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని కింగ్ కోఠి ఆస్పత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ నివేదిత తెలిపారు. వారికి తగిన సలహాలు ఇస్తున్నామని చెప్పారు. మానసిక ఆరోగ్యం ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.