సొసైటీ ఓటరు జాబితాలో సిత్రాలు..!

ABN , First Publish Date - 2020-02-08T11:08:51+05:30 IST

బయ్యారం సొసైటీ ఓటు జాబితాలో పలు సిత్రాలు చోటుచేసుకున్నాయి. చనిపోయిన వారి పేర్లు, పలు టీసీల్లో

సొసైటీ ఓటరు జాబితాలో సిత్రాలు..!

లిస్టులో ప్రభుత్వ కార్యాలయాల పేర ఓటు

ఒకే ఓటరు పేరు నాలుగు టీసీల్లో నమోదు


బయ్యారం, ఫిబ్రవరి 7 : బయ్యారం సొసైటీ ఓటు జాబితాలో పలు సిత్రాలు చోటుచేసుకున్నాయి. చనిపోయిన వారి పేర్లు, పలు టీసీల్లో ఓటరు పేరు రిపీట్‌ అవడమే కాకుండా ఏకంగా ప్రభుత్వ కార్యాలయల పేర సైతం ఓటు నమోదు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తప్పుల తడకగా ఓటరు జాబితా రూపొందించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బయ్యారం సొసైటీ పరిధిలోని 13 టీసీ స్థానాల్లో మొత్తం 5957 మంది ఓటర్లు ఉన్నాయి. అయితె ఇందులో చనిపోయిన వారి పేర్లు అధికంగా ఉండటం ఆశ్చర్యానికి  గురిచేస్తోంది. అంతేకాక ఒక్కో టీసీ పరిధిలో 500 మేర ఓటర్లు ఉంటే అందులో 10 శాతం వరకు చనిపోయిన వారి పేర్లే ఉన్నట్లు సమాచారం.


అదే విధంగా ఒక్క ఓటరు పేరు 3,4 టీసీలలో రిపీట్‌గా నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏకంగా బయ్యారం గ్రామపంచాయతీ పేర ఓటరు జాబితాలో ఓటు నమోదు కావడం ఆశ్యర్యానికి గురిచేస్తోంది. క్రమ సంఖ్య 1096, ప్రవేశ సంఖ్య 7084 పేర ఓటరు లిస్టులో పేరు నమోదై ఉంది. గ్రామపంచాయతీ కులం కూడా ఓసీగా నమోదైంది. 1996లో నమోదు చేయించుకున్న ఈ ఓటరు యొక్క వయస్సు 84 సంత్సరాలుగా ఓటరు లిస్టులో పేర్కొనబడి ఉంది. అదే విధంగా క్రమ సంఖ్య 1092, ప్రవేశ సంఖ్య 7076 పేర కూడా దివంగత పరుచూరి నరేంద్రబాబు పేర ఓటు నమోదైంది. టీడీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉపాధ్యాక్షునిగా పనిచేసిన నరేంద్రబాబు 28-08-2008లో అనారోగ్యంతో మృతిచెందాడు. అంతేకాక బయ్యారం బస్టాండ్‌ సెంటర్లలో నరేంద్రబాబు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికి సహకార ఓటరు జాబితాలో ఇంకా పేరు కొనసాగడం కొసమెరుపు.

Updated Date - 2020-02-08T11:08:51+05:30 IST