సింగిల్‌ థియేటర్లు తెరిస్తే కష్టాలే

ABN , First Publish Date - 2020-07-28T08:20:20+05:30 IST

అసలు సినిమా థియేటర్లు తెరిచే పరిస్థితి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉందా? ఒకవేళ తెరిచినా జనం వస్తారా? 25 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లు నడపడం

సింగిల్‌ థియేటర్లు తెరిస్తే కష్టాలే

  • జనం రాకపై సందేహాలు.. 25% సీటింగ్‌తో భారమవుతుందనే భయం
  • శానిటైజేషన్‌ ఖర్చులూ రావనే ఆవేదన
  • ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ అదుపుపై ఆందోళన
  • సినిమా హాళ్లు తెరవడంపై సింగిల్‌ 
  • స్ర్కీన్‌ యజమానుల అభిప్రాయం
  • సమస్యల పరిష్కారానికి సర్కారుకు వినతి
  • తెరవడానికి తొందరపడుతున్న మల్టీప్లెక్స్‌లు
  • షేర్‌ విలువ పడిపోతోందనే ఆందోళనే కారణం

అసలు సినిమా థియేటర్లు తెరిచే పరిస్థితి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉందా? ఒకవేళ తెరిచినా జనం వస్తారా? 25 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లు నడపడం సాధ్యమేనా? థియేటర్‌లో వేయడానికి సరిపడా సినిమాలు ఉన్నాయా? ఒకవేళ, ఏదైనా పెద్ద నటుడి సినిమా వస్తే.. ఫ్యాన్స్‌ను ఆపడం తరమా!? ఆగస్టు నుంచి సినిమా హాళ్లు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందనే వార్తల నేపథ్యంలో థియేటర్‌ యజమానులను వేధిస్తున్న ప్రశ్నలివి.(ఆంధ్రజ్యోతి, సినిమా డెస్క్ ‌)

ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ థియేటర్లు తెరవడానికి మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు తహతహలాడుతుంటే, మరికొన్ని రోజులు ఆగుదామని సింగిల్‌ స్ర్కీన్‌ యజమానులు అంటున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించే 25 శాతం సీటింగ్‌ సామర్థ్యం తమకు ఆమోదయోగ్యం కాదని, దానివల్ల వచ్చే డబ్బు శానిటైజ్‌ ఖర్చులకు కూడా సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదారు వందల సీటింగ్‌ కెపాసిటీ కలిగిన థియేటర్‌లో ఏ వంద మందినో కూర్చోబెట్టి, ఏసీ వేసి కరెంట్‌ చార్జీలు, శానిటైజేషన్‌ ఖర్చులు భరించే శక్తి తమకు లేదని కొందరు థియేటర్‌ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈలోపు తమ విన్నపాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో, కేంద్రం ఓకే చెప్పినా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తాయా అనే సందిగ్ధంలో యజమానులు ఉన్నారు. ఆగస్టులోనే సినిమా హాళ్లు తెరిచేలా చేయడానికి మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు తొందరపడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. నాలుగు నెలల నుంచీ థియేటర్లు మూతపడి ఉండడంతో మార్కెట్లో మల్టీప్లెక్స్‌ల షేర్‌ వేల్యూ బాగా పడిపోయిందని, మరి కొంత కాలం పరిస్థితి ఇలాగే కొనసాగితే, అసలుకే మోసం వస్తుందని భావించిన మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు ఢిల్లీలో లాబీయింగ్‌ చేశాయని సినిమా వర్గాలు చెబుతున్నాయి. 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతోనైనా థియేటర్లు నడపడానికి సిద్ధమని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఏఐ) ఇప్పటికే ప్రకటించడానికి ఇదే కారణమని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం 25 శాతం సీటింగ్‌తోనే మొదలు పెట్టాలని సూచిస్తోంది. దీనికి మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయనే సందిగ్ధం నెలకొంది.


సింగిల్‌ స్ర్కీన్‌ సమస్యల నిలయం

సినిమా థియేటర్లకు ప్రధాన సమస్య కరెంట్‌ చార్జీలు. నాలుగు నెలల నుంచి థియేటర్‌ మూసి ఉన్నా లక్షల రూపాయల్లో కరెంట్‌ బిల్‌ రావడంతో సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్‌ యజమానులు షాకవుతున్నారు. యూజర్‌ చార్జీలు కూడా వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ఏదన్నా విపత్తు కారణంగా సినిమా థియేటర్‌ 30 రోజులకు మించి మూతపడితే ప్రభుత్వ పన్నులో 50 శాతం మాత్రమే చెల్లించవచ్చని మునిసిపల్‌ చట్టంలో ఉందని, దానిని ఇప్పుడు తమకు వర్తింపచేయాలని సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్‌ యజమానులు కోరుతున్నారు. యూజర్‌ చార్జీలపై రాయితీ ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చిందని, కానీ, అది అమలు కావడం లేదని వాపోతున్నారు. అంతేనా, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్వంలో ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌ మీటింగ్‌ ఇటీవల జరిగింది. సింగిల్‌ థియేటర్స్‌కు మినిమం కరెంట్‌ చార్జీ విధానాన్ని తొలగించి, ఎంత కరెంట్‌ వినియోగిస్తే అంత చెల్లించే విధానం కొనసాగించాలని ఈ సమావేశం తీర్మానించింది. అలాగే, లాక్‌డౌన్‌ సమయంలోని ఇతర పన్నులను కూడా తొలగించాలని, జీఎస్టీ విషయంలో సింగిల్‌ థియేటర్లకు న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ఓ వినతి పత్రం పంపించారు. దానికి వచ్చిన స్పందనను బట్టి థియేటర్లు తెరిచే విషయంపై నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నాయి.


విదేశాల్లో మూతే!

కరోనా ప్రభావం విదేశాల్లోని థియేటర్ల మీద కూడా పడింది. అగ్రరాజ్యం అమెరికాలో సైతం థియేటర్లను తెరవడానికి వెనకాడుతున్నారు. థియేటర్లు తెరిచినా జనం వస్తారనే నమ్మకం లేకపోవడమే దీనికి కారణం. అందుకే ఈ ఏడాది విడుదల కావాల్సిన చాలా సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. కరోనా విజృంభించిన మిగిలిన చాలా దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక, కరోనా పుట్టిల్లు చైనాలో థియేటర్లు తెరిచారు. కానీ, ప్రేక్షకులకు వైరస్‌ సోకడంతో మళ్లీ మూసేశారు. మహమ్మారి ప్రభావం తక్కువగా ఉన్న జపాన్‌, న్యూజిలాండ్‌, దుబాయ్‌ల్లో మాత్రమే థియేటర్లు తెరిచి ఉన్నాయి. జపాన్‌లో ప్రభాస్‌ చిత్రం ‘సాహో’ రీ-రిలీజ్‌కు ఇటీవల మంచి స్పందన వచ్చింది.మళ్లీ కరోనా వస్తే...

కష్టాలు, నష్టాల విషయం పక్కనబెట్టినా.. కరోనా భయం థియేటర్‌ యజమానులను వేధిస్తోంది. థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజ్‌ చేసి ప్రేక్షకులను జాగ్రత్తగా థియేటర్‌లోకి పంపినా, ఇంటర్వెల్‌ సమయంలో, సినిమా వదిలాక వారిని నియంత్రించడం చాలా కష్టం. హాల్లో 25 శాతమో.. 50 శాతమో ఉన్నా.. ఏసీ వేసినప్పుడు గాలి థియేటర్‌ అంతటా తిరుగుతుంది. కరోనా పాజిటివ్‌లు ఎవరైనా సినిమాకు వచ్చినా.. లక్షణాలు లేకుండా కరోనా సోకిన వాళ్లు వచ్చినా ఆ వైరస్‌ థియేటర్‌ అంతటా పాకుతుంది. దానిని నిలువరించడం సాధ్యమయ్యే పనికాదు. దీనికితోడు, ప్రతి షో పూర్తయిన తర్వాత థియేటర్‌ మొత్తం శానిటైజ్‌ చేయడమనేది భారీ ఖర్చుతో కూడుకున్న అంశం. అంతేనా, థియేటర్ల కారణంగా ఏ ఒక్కరికి వైరస్‌ సోకినా మళ్లీ లాక్‌డౌన్‌ అని ప్రభుత్వం అంటుందనే భయం వారిని పీడిస్తోంది. ఇక, అన్నిటికన్నా ముఖ్యంగా, పెద్ద నటుడి సినిమా ఏదైనా రిలీజ్‌ అయితే.. థియేటర్‌ బయట అభిమానులను నిలువరించడం తలకు మించిన భారమే. అందుకే, ఓ రెండు నెలలు ఆగితే, వ్యాక్సిన్‌ వచ్చినా రాకపోయినా కరోనా కొంత తగ్గుముఖం పట్టవచ్చని, అప్పటి వరకూ ఆగితేనే మేలనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అంతేనా, పెద్ద సినిమాలన్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడిపోయాయని, ఇప్పుడు థియేటర్లు తెరిచి ప్రయోజనం ఏమిటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2020-07-28T08:20:20+05:30 IST